- తూప్రాన్ హాస్పిటల్ కు జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్
- దుబ్బాక హాస్పిటల్ కు రెండుసార్లు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్
మెదక్/సిద్దిపేట/తూప్రాన్: వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన డయాలసిస్ సేవలు అందిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ కమ్యూనిటీ హాస్పిటల్ జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఒకే ఏడాదిలో రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
అత్యుత్తమ సేవలతో..
మెదక్ జిల్లా తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. 4 బెడ్స్ తో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ప్రతిరోజు నాలుగు షిఫ్ట్ ల్లో 16 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ లో తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, మాసాయిపేట, శివ్వంపేట మండలాలతో పాటు పొరుగున ఉన్న సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల గ్రామాలకు చెందిన కిడ్నీ బాధితులు డయాలసిస్ సేవలు పొందుతున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ సైకిల్స్..
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ సైకిల్స్ పూర్తి చేసినందుకు తూప్రాన్ సీహెచ్ సీ జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. తద్వారా బెస్ట్ అవార్డుకు ఎంపికైంది. ఆరు నెలల వ్యవధిలో 1,800 సైకిల్స్ పూర్తి చేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ అవార్డుకి ఎంపిక చేశారు.
ఏడాదిలో రెండు సార్లు..
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రెండున్నరేళ్ల కింద డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. నాలుగేండ్ల కింద ప్రారంభించిన వంద పడకల ఆస్పత్రిలో 2023 మార్చిలో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 5 బెడ్స్ ఉండగా ప్రతీరోజు మూడు షిఫ్టుల్లో 15 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఒక్కో షిప్ట్‌లో నాలుగు గంటల పాటు రోగులకు డయాలసిస్ సేవలు అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఇప్పటి వరకు దుబ్బాక డయాలసిస్ సెంటర్ లో 10 వేల మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందాయి. రోగులకు సేవలు అందించడం కోసం ఆరుగురు సిబ్బంది పనిచేస్తున్నారు.
డయాలసిస్ రోగులకు ఉత్తమ సేవలు అందించినందుకు ఒకే ఏడాదిలో రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా జాతీయ స్థాయిలో మొత్తం 14 సెంటర్లలో దుబ్బాక డయాలసిస్ సెంటర్ ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సైతం దుబ్బాక డయాలసిస్ సెంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయంపై దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో డయాలసిస్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం వల్ల రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని తెలిపారు.
మరింత ఉత్సాహంతో పనిచేస్తాం
తూప్రాన్ హాస్పిటల్ కు నేషనల్ లెవల్ లో బెస్ట్ అవార్డు రావడం సంతోషకరంగా ఉంది. డయాలసిస్ సెంటర్ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన సేవలు అందించి తూప్రాన్ హాస్పిటల్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాం. డాక్టర్ అమర్ సింగ్ , తూప్రాన్ హాస్పిటల్ సూపరింటెండెంట్
