రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ..  వేజ్ బోర్డ్ ఎరియర్స్ చెల్లింపులో ఆలస్యం

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ..  వేజ్ బోర్డ్ ఎరియర్స్ చెల్లింపులో ఆలస్యం

నస్పూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డ్ ఎరియర్స్, లాభాల వాటా చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఏఐటీయూసీ, సీపీఐ లీడర్లు అన్నారు. వేజ్ బోర్డ్ ఏరియర్స్ మొత్తాన్ని ఒకే దఫా చెల్లించాలని గురువారం శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. వేల కోట్ల లాభాల్లో సింగరేణి సంస్థ ఉందని ప్రకటించిన యాజమాన్యం నేడు ఎరియర్స్ చెల్లింపుల కొరకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.29 వేల కోట్ల బకాయిలు ఉందని, యాజమాన్యం బ్యాంకుల చుట్టూ తిరగకుండా వాటిని వెంటనే వసూలు చేయాలని డిమాండ్​చేశారు. కార్మికులకు రావాల్సిన ఎరియర్స్ మొత్తాన్ని ఒకే దఫా, లాభాల వాటా 35 శాతం చెల్లించాలన్నారు. ఏఐటీయూసీ లీడర్లు వీరభద్రయ్య, సమ్మయ్య,  బాజీ సైదా, సీపీఐ లీడర్లు శంకర్, రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, కిషన్ రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోచ్ ఖాన్, సన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు