
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరింత తీవ్రమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టికెట్ల పంచాయితీ ఎక్కువవుతోంది. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమాను ఎవరికి వారు వ్యక్తం చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో 17 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉండగా.. 2018లో బీఆర్ఎస్ 14 సీట్లలో గెలుపొందింది. ఎల్బీనగర్, మహేశ్వరం, తాండూరు స్థానాల్లో కాంగ్రెస్ నేతలు గెలిచినప్పటికీ.. ఆ ముగ్గురూ కొన్నాళ్లకే గులాబీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. అన్ని ప్రాంతాల్లోనూ అసమ్మతి నేతలున్నారు. కొన్ని సెగ్మెంట్లలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారంటే బీఆర్ఎస్లో వర్గపోరు ఎలా ఉందో అర్థమవుతోంది.
ఆ జిల్లాలో కాంగ్రెస్ నుంచి వచ్చి వారికే ప్రాధాన్యత
రంగారెడ్డి జిల్లాలో 8 ఎమ్మెల్యే స్థానాలుండగా రెండు మినహా మిగతా అన్ని చోట్లా ఆశావహులు ఉన్నారు. అయితే, కాంగ్రెస్‌నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికే పదవులు దక్కాయి. పార్టీలో చేరిన వెంటనే సబితారెడ్డికి మంత్రి పదవి, సుధీర్‌రెడ్డికి మూసీ పరివాహక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవులను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది. మిగతా 6 చోట్ల గెలిచిన లీడర్లలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి మాత్రమే విప్ పదవి ఇచ్చింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూడోసారి, చేవెళ్ల నుంచి యాదయ్య రెండోసారి విజయం సాధించారు. అయినప్పటికీ ఇలాంటి సీనియర్లని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వారికే అధిష్టానం పదవులు అప్పగించింది. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. గత ఎన్నికల్లో మహేశ్వరం, ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ నేతలు తీగల కృష్ణారెడ్డి, రామ్మోహన్ గౌడ్ ఇప్పుడు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మధ్య పంచాయితీ నడుస్తోంది. అధిష్టానం టికెట్నాకే ఇస్తుందంటూ ఇద్దరూ ప్రచారం చేసుకుంటూ జనాల్లో తిరుగుతున్నారు. రాజేంద్రనగర్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు మంత్రి సబితారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి టికెట్ కోసం ఆశిస్తున్నారు. షాద్ నగర్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పడింది. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి అంజయ్యతోపాటు ప్రతాప్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు.
మేడ్చల్ – మల్కాజిగిరిలో అసమ్మతి సెగలు
మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్ స్థానాల్లో బీఆర్ఎస్ నేతలే సిట్టింగ్‌లో ఉన్నప్పటికీ.. డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించకపోవడం, అర్హులైన వారికి పెన్షన్లు అందించకపోవడంతో వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలోనూ కనీస వసతులు కల్పించడంలో సిట్టింగ్‌లు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో వర్గపోరు, అసమ్మతి సెగలు రాజుకున్నాయి. టికెట్ కోసం సొంత పార్టీ నేతలే పావులు కదుపుతూ సిట్టింగ్‌లకు ఎసరుపెట్టే పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో భేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ భర్త మోతె శోభన్ రెడ్డి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తు న్నారు. మేడ్చల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉండగా.. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టికెట్ కోరుకుంటున్నారు. వివేకానంద ఎమ్మెల్యేగా ఉన్న కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు టికెట్ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా ఉండే తమ నేతకే టికెట్ వస్తుందని శంభీపూర్ రాజు వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలకు చెందిన లీడర్లు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు.
వికారాబాద్‌లో కుమ్ములాట
జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు, తన నియోజకవర్గంలోనే పార్టీ నేతలతో విభేదాలు నెలకొన్నాయి. ఈ సారి ఆనంద్కి తప్ప టికెట్ ఎవరికిచ్చినా తాము మద్దతిస్తామని కొందరు ఉద్యమకారులు బహిరంగంగా చెప్పారు. ఆనంద్‌కు టికెట్ఇస్తే పార్టీలోనే ఉంటూ ఆయనను ఓడిస్తామని ప్రకటించారు. కాగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆనంద్‌కు మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. జిల్లా జడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్న మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డిపై ఇటీవల ఆనంద్ వర్గీయులు దాడికి పాల్పడి ఆమె కారు అద్దాలు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పంచాయితీ మరింత ముదిరింది. దీంతో మహేందర్ రెడ్డి వర్గీయులు ఆనంద్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం ఆనంద్‌కు వ్యతిరేకంగా కొందరు ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేయగా.. తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వెళ్లి, వారితో గొడకు దిగారు. కుర్చీలు విసిరేసి, టెంట్‌ను కూల్చేశారు. తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య కూడా విభేదాలు తీవ్రమయ్యాయి. ఎన్నికల తర్వాత నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు టికెట్ విషయంలో ఇద్దరూ ధీమాతో ఉన్నారు. మహేందర్‌రెడ్డికి టికెట్రాకపోతే పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. తాండూరు, కొడంగల్, పరిగి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే తన వర్గం అభ్యర్థులను సిద్ధంగా ఉంచుకొని, చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వికారాబాద్ టికెట్ కోసం చాలా మంది అభ్యర్థులు క్యూ లైన్లలో ఉన్నారు. వడ్ల నందు, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, భూమెళ్ల కృష్ణయ్య, ఎం.రమేశ్‌తో పాటు 15 మంది వరకు టికెట్ ఆశిస్తు న్నారు. పరిగిలోనూ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మధ్య వార్ నడు స్తోంది. కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మధ్య టికెట్ పంచాయితీ కొనసాగుతోంది.