
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేశారు. 45 మందితో రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సాయంత్రం(అక్టోబర్ 27న) విడుదల చేసింది. 55 మందితో ఇటీవల తొలి జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య వందకు చేరింది. ఇంకా 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే... ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు టిక్కెట్లు దక్కించుకున్నారు.
పార్టీ అధిష్టానం కూడా పాత వారికి కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమకే టిక్కెట్లు వస్తాయని ఆశపడ్డ నాయకులు.. ఇప్పుడు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ కుమార్తె జీవీ వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కేటాయించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి కి రెండో జాబితాలో అవకాశం కల్పించారు.
ఈ మధ్యే కాంగ్రెస్లో చేరిన నాయకులు వీళ్లే
* ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్ -టికెట్ ను ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఈయన ఈ మధ్యే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన కొద్దిరోజుల్లోనే సీనియర్లతో వివాదాలు తలెత్తాయి. ఆర్ఎస్ఎస్ భావాలున్న కంది శ్రీనివాస్ అమెరికా నుంచి రాగానే బీజేపీలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు.
* ఆసిఫాబాద్ – శ్యామ్ నాయక్
ఆసిఫాబాద్ టికెట్ ను శ్యామ్ నాయక్ కు కేటాయించారు. ఈయన ప్రస్తుత ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త. ఈ మధ్యే శ్యామ్‌నాయక్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఖానాపూర్టికెట్ ఈసారి రేఖానాయక్ కు బీఆర్ఎస్ అధిష్టానం ఇవ్వలేదు. జాన్సన్ నాయక్‌కు ఇచ్చారు. దీంతో పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రేఖానాయక్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.
* ముధోల్ – నారాయణ పటేల్
ముధోల్ టికెట్ ను నారాయణ పటేల్ కు ఇచ్చారు. గతంలో ముధోల్ నియోజకవర్గ రాజకీయాలను శాసించిన పటేల్ సోదరులు ఇప్పుడు కుటుంబంలో కొన్ని రాజకీయ వైరుధ్యాలతో ఎవరికి వారుగా విడిపోయారు. నారాయణ పటేల్ సొంత సోదరుడు మోహన్ రావు పటేల్, పెద్దమ్మ కొడుకు రామారావు పటేల్... ముగ్గురు గతంలో జట్టుగా ఉండేవారు. రెండు సార్లు నారాయణరావు పటేల్ ఎమ్మెల్యేగా గెలవడానికి ఇద్దరు సోదరుల సపోర్ట్ ఉందని నియోజకవర్గంలో టాక్. ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన నారాయణ పటేల్ ముధోల్ టికెట్ దక్కించుకున్నారు.
* కూకట్ పల్లి – బండి రమేష్
కూకట్ పల్లి టికెట్ బండి రమేష్ కు ఇచ్చారు. ఈయన బీఆర్ఎస్ నుంచి ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండి రమేష్ కి శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతోనే బీఆర్ఎస్ ను వీడారని ప్రచారం ఉంది. బండి రమేష్ కు కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టికెట్ హామీ రావడంతోనే కాంగ్రెస్ లోకి వెళ్లారని టాక్.
* శేరిలింగంపల్లి – జగదీష్ గౌడ్
శేరిలింగంపల్లి టికెట్ ను జీహెచ్ఎంసీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కు కేటాయించారు. ఈయన ఈ మధ్యే తన భార్యతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. జగదీశ్వర్ గౌడ్ భార్య వి. పూజిత కూడా కార్పొరేటర్ కావడం విశేషం.
* తాండూరు – మనోహర్ రెడ్డి
తాండూరు టికెట్ ను -మనోహర్ రెడ్డికి కేటాయించారు. ఈయన గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. ఈ మధ్యే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి... ఇప్పుడు టికెట్ దక్కించుకున్నారు.
* సికింద్రాబాద్ కంటోన్మెంట్ – వెన్నెల
సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ ను గద్దర్ కూతురు వెన్నెలకు కేటాయించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు లాస్య నందిత ఎన్నిక బరిలో ఉన్నారు. సాయన్న కూడా ఈ మధ్యే చనిపోయారు. ఆయన వారసురాలిగా లాస్య నందిత తెరపైకి రావడంతో ఆమెకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించింది.
* మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టికెట్ ను యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఈయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యే చేరారు.
* మునుగోడు – కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు టికెట్ ను కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఇచ్చారు. బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ లో చేరిన రెండోరోజే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మునుగోడు టికెట్ ఇచ్చింది.
* పాలకుర్తి – యశస్విని
పాలకుర్తి టికెట్ ను యశస్వినికి ఇచ్చారు. ఈమె ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోడలు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ అనుకున్నారు. అయితే... చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డికి టికెట్ ఇచ్చారు.
* పరకాల - రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల టికెట్ ను రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇచ్చారు. ఈయన గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. ఈ మధ్యే ఢిల్లీలో రాహుల్సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పరకాల టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బరిలో ఉన్నారు.
* వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట టికెట్ ను కేఆర్ నాగరాజుకు కేటాయించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచనతో వెళ్తోంది. స్థానికుడితోపాటు వర్ధన్నపేటలోనే ప్రొహిబిషనరీ ఎస్సైగా 1990 లో పోలీస్ కెరీర్ ప్రారంభించిన నాగరాజు.. ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. స్పెషల్ పార్టీలో పని చేసిన సమయంలోనూ ఇక్కడ చాలామందితో పరిచయం ఉంది. హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పనిచేసి మళ్లీ వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, ఆ తర్వాత ఐపీఎస్ వచ్చాక నిజామాబాద్ కమిషనర్‌గా పనిచేసి 2023 మార్చి 21న రిటైర్డ్ అయ్యారు.
* ఖమ్మం – తుమ్మల నాగేశ్వర్ రావు
ఖమ్మం టికెట్ తుమ్మల నాగేశ్వర్ రావుకు ఇచ్చారు. ఈయనకు బీఆర్ఎస్ అధిష్టానం పాలేరు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఖమ్మం టికెట్ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ తరపున ఖమ్మం నుంచి ఎన్నిక బరిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు.
* పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాలేరు టికెట్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఈ మధ్యే బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
* పినపాక – పాయం వెంకటేశ్వర్లు
పినపాక టికెట్ ను పాయం వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. ఈయన గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరుంది.