
- ఢిల్లీ సర్కారుకు హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ట్రాన్స్జెండర్లకు సపరేట్గా పబ్లిక్ టాయిలెట్లు కట్టాలన్న ఆదేశాలను సర్కార్ అమలు చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఎనిమిది వారాల్లోగా టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, లేకపోతే ఢిల్లీ సర్కార్, ఎన్డీఎంసీ ఉన్నతాధికారులను కోర్టుకు పిలుస్తామని హెచ్చరించింది. ఢిల్లీలోని పబ్లిక్ టాయిలెట్లలో ట్రాన్స్జెండర్లు వేధింపులకు గురవుతున్నందున, వారికి ప్రత్యేక టాయిలెట్లు కట్టాలంటూ జాస్మిన్ కౌర్ ఛాబ్రా కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఢిల్లీ ప్రభుత్వానికి, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ)కి గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
ట్రాన్స్జెండర్ వ్యక్తుల(హక్కుల రక్షణ) చట్టం ప్రకారం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, టాయిలెట్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని, అప్పటివరకు దివ్యాంగుల టాయిలెట్లను ట్రాన్స్ జెండర్లు వాడుకోవచ్చంటూ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఆధ్వర్యంలోని బెంచ్ మంగళవారం తీవ్రంగా స్పందించింది. కేవలం పేపర్ పైనే ప్రాసెస్ నడుస్తున్నట్లు ఉందని అభిప్రాయపడింది. తాజా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణ జులై 14కు వాయిదా వేసింది.