పులులొస్తున్నయ్..! 4 పెద్దపులు, 4 చిరుతలు

పులులొస్తున్నయ్..! 4 పెద్దపులు, 4 చిరుతలు

ఆదిలాబాద్, వెలుగు: మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా అడవుల్లోకి పులులు ప్రవేశిస్తున్నాయి. పెన్‌‌‌‌‌‌‌‌గంగ నది ప్రవాహం తగ్గడంతో పాటు ఆవాసం, తోడు, ఆహారం కోసం పెద్దపులులు, చిరుతలు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌‌‌‌‌‌‌‌, తడోబా అభయారణ్యం, కిన్వాట్‌‌‌‌‌‌‌‌ అడవుల్లోంచి ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లోని అడవులకు వలస వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట పులి పాదముద్రలను గుర్తిస్తున్నారు. పులులు పంట పొలాల్లోకి వస్తూ పశువులపై దాడి చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ శివార్లలోనూ పులులు సంచరిస్తున్నాయి. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పొల్లాలో పనులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డప్పు చప్పుళ్లు చేస్తూ ఉండాలని, ఆయుధాలు దగ్గర పెట్టుకోవాలని చెబుతున్నారు.

నాలుగు పులులు, నాలుగు చిరుతలు

తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా బోథ్‌‌‌‌‌‌‌‌ మండల అటవీ ప్రాంతంలోకి గత నెలలో ఓ పెద్ద పులి ప్రవేశించింది. బాబెర గ్రామానికి చెందిన రైతు జాదవ్‌‌‌‌‌‌‌‌ దిలీప్‌‌‌‌‌‌‌‌ పంట పొలంలో కట్టేసి ఉన్న ఆవుపై దాడి చేసి చంపేసింది. రైతు గట్టిగా కేకలు వేయడంతో రెండ్లపల్లె గ్రామంలో నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. వజ్జర్, చింతగూడ గ్రామాల్లో సైతం పెద్దపులి అడుగుజాడలను గుర్తించారు. పెద్దపులులతో పాటు నాలుగు చిరుతలు సైతం మహారాష్ట్ర నుంచి వచ్చి వెళ్తున్నట్లు ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. బోథ్‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పెద్దపులే నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్, కుంటాల, నర్సాపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సారంగాపూర్ మండలంలోని రవీంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో చిరుత పులి రెండు మేకలను చంపేసింది. ఇదే మండలంలోని అడెల్లి పోచమ్మ అటవీ శివారులో మూడు మేకలు, ఒక ఆవును చంపింది. మూడు రోజుల కింద కుంటాల మండలంలోని అంబుగాం, సూర్యాపూర్‌‌‌‌‌‌‌‌ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. సూర్యాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన రైతు కుంచపు సాయన్నకు చెందిన రెండు పశువులను అది చంపేసింది. నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామ శివారులో సైతం పెద్దపులిని గ్రామస్తులు చూశారు. అటు ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని కెరమెరి, కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ డివిజన్లలోనూ రెండు పెద్ద పులులు సంచరిస్తున్నాయి. 

పులుల రక్షణకు చర్యలు

ఆఫీసర్లు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఒక పెద్ద పులి, చిరుత ఆనవాళ్లు రికార్డు అయ్యాయి. వేటగాళ్ల నుంచి పులులను రక్షించేందుకు నిర్మల్ జిల్లా ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఐదు టీంలను ఏర్పాటు చేశారు. డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో, ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌వోలతో పాటు సిబ్బందిని నియమించి పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర అప్పారావుపేట, మలక్‌‌‌‌‌‌‌‌జాం, శివుని, కిన్వాట్‌‌‌‌‌‌‌‌ అటవీ రేంజ్‌‌‌‌‌‌‌‌ అధికారులతో సమన్వయం చేసుకొని పులుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. బోథ్ ఫారెస్ట్ రేంజ్‌‌‌‌‌‌‌‌ పరిధిలో12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. బేస్‌‌‌‌‌‌‌‌ క్యాంపులు, యానిమాల్‌‌‌‌‌‌‌‌ ట్రాకర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి 10 మందిని అందుబాటులో ఉంచారు. అయితే పులుల అడుగుజాడలను బట్టి వేటగాళ్లు వాటిపై దాడి చేసే అవకాశం ఉండడంతో పులి సంచారం విషయాన్ని ఆఫీసర్లు ధ్రువీకరించడం లేదు. పులి అడుగు జాడలు కనిపించిన వెంటనే కవ్వాల్‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది వచ్చి తగిన రక్షణ చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులను చంపేందుకు పంట పొలాలతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్‌‌‌‌‌‌‌‌ వైర్లను తొలగింపచేస్తున్నారు. పులుల రక్షణ కోసం మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటున్నారు. 

సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం

బోథ్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల పెద్దపులి సంచరించింది. పెద్దపులితో పాటు చిరుతలు సైతం మహారాష్ట్ర నుంచి వలస వస్తున్నాయి. ప్రజలను అలర్ట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు పులుల సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాలతోపాటు పాటు బేస్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశాం. పది మంది ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టాం.
- ప్రణయ్, ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌వో, బోథ్‌‌‌‌‌‌‌‌