స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్ యాక్షన్ ప్లాన్

స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్ యాక్షన్ ప్లాన్
  • నామినేషన్ల నుంచికౌంటింగ్‌‌ దాకా పటిష్ట బందోబస్తు
  • స్థానిక పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షలు
  • నిరంతరం పర్యవేక్షిస్తున్నడీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ మొదలు నవంబర్‌‌‌‌ 8న కౌంటింగ్‌‌ ముగిసే వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌‌ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. అడిషనల్‌‌ డీజీ (లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌) మహేశ్‌‌ భగవత్‌‌తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

 ఇందులో భాగంగా అడిషనల్ డీజీ మహేశ్‌‌ భగవత్‌‌ అన్ని జిల్లాల యూనిట్‌‌ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. కోడ్‌‌ అమలులో ఉన్న ప్రాంతాలకు సంబంధించి నివేదికలు తెప్పిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు.  

ఎన్నికల హ్యాండ్‌‌ బుక్‌‌పై అవగాహన

గ్రామీణ ప్రాంతాల్లో మోడల్‌‌ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌ సహా ఇతర భద్రతా పరమైన అంశాలపై స్థానిక డీఎస్పీలు అప్రమత్తంగా ఉండేలా సమీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల హ్యాండ్‌‌బుక్‌‌లోని ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని, అనుమానాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎస్పీ ఆఫీసులు, కమిషనరేట్‌‌ కార్యాలయాల్లో ఎలక్షన్‌‌ సెల్‌‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టారు. సీనియర్‌‌‌‌ అధికారులు, సిబ్బందిని ఎలక్షన్‌‌ సెల్‌‌లో నియమించనున్నారు. 

గత ఎన్నికల్లో జరిగిన పలు ఘటనలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లు, ఎలక్షన్ల సమయాల్లో గొడవలు సృష్టించే వారిని ఆయా రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్‌‌ చేయనున్నారు. దీంతో పాటు నగదు ట్రాన్స్‌‌పోర్ట్‌‌పై ప్రత్యేక నిఘా పెట్టే విధంగా స్పెషల్ టీమ్‌‌లను ఏర్పాటు చేయనున్నారు.