- అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ వెల్లడి
- సమిట్ భద్రతా ఏర్పాట్లు, బందోబస్త్‌పై రివ్యూ మీటింగ్
ఇబ్రహీంపట్నం, వెలుగు: తెలంగాణ గ్లోబల్ సమిట్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సమిట్‌లో అడుగడుగునా నిఘా కోసం వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేసి, సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు వివరించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో జరిగే మొత్తం మీటింగ్ ప్రదేశాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఐజీ రమేశ్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం సమిట్ భద్రతా ఏర్పాట్లు, బందోబస్త్‌పై వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఏ మాత్రం పొరపాటు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
సమిట్కు కావాల్సిన సదుపాయాలు, బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్లవంటి మౌలిక సదుపాయల గురించి అధికారులతో చర్చించారు. సమిట్ జరిగే రెండ్రోజుల పాటు (డిసెంబర్ 8, 9) ఆయా మార్గాల్లో వాహనాల మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.
