
- ఛత్రసాల్ స్టేడియంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్
- గ్యాంగ్‌స్టర్స్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్న పోలీసులు
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యంగ్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో అతనికి పెద్ద శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. సాగర్‌పై దాడిలో సుశీల్ స్వయంగా పాల్గొన్నాడని ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో సుశీల్‌ను ఛత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లారు. సీన్ రీక్రియేషన్ ద్వారా మరి కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. కాగా, బలమైన వస్తువుతో తల మీద కొట్టడం వల్ల సాగర్ మరణించాడని డాక్టర్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కాగా, సుశీల్, అతని అనుచరుడు అజయ్ ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. అయితే, ఆ రోజు రాత్రి లాకప్‌లో ఉన్న సుశీల్ బాగా ఏడ్చాడని, ఆహారం తీసుకోలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. రాత్రంతా నిద్రపోలేదని చెప్పాయి. మరోవైపు గ్యాంగ్‌స్టర్స్‌తో సుశీల్ సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తీహార్ జైలులో ఉన్న ప్రముఖ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవాన ఈ హత్య కేసులో సుశీల్‌కు సాయం చేశాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఛత్రసాల్ స్టేడియంలో సాగర్‌పై దాడిలో నీరజ్ అనుచరులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.
రైల్వే శాఖ సస్పెన్షన్ వేటు..
సుశీల్‌పై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. నార్తర్న్ రైల్వేస్‌లో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా పని చేస్తున్న స్టార్ రెజ్లర్‌ను ఆ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.