తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా కీలక మార్పులు చేసిన టీటీడీ

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా కీలక మార్పులు చేసిన టీటీడీ
  • టీటీడీ నిర్ణయం త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లూ ప్రారంభం 
  • ఉదయం 10కి వీఐపీ బ్రేక్ దర్శనం 
  • భక్తుల రద్దీ దృష్ట్యా మార్పులు

హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు తిరుమలలో రూమ్​లు దొరకని పరిస్థితి ఉండటంతో ఇకపై తిరుపతిలోనే రూమ్​ల బుకింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీనిని అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో ఎ.వి. ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
‘‘తిరుమలలో రూంల కేటాయింపును ఇకపై తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. దీనివల్ల తిరుమలలో రూంలు దొరకని భక్తులు తిరుపతిలోనే బస చేసే అవకాశం ఉంటుంది” అని ఆయన వెల్లడించారు. త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లను కూడా ప్రారంభిస్తామని, టోకెన్లు తీసుకున్న తర్వాత భక్తులు తిరుపతిలోనే రూంలు బుక్ చేసుకుని తిరుమలకు రావాల్సి ఉంటుందన్నారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శన సమయాన్ని ఉదయం10 గంటలకు మార్చనున్నట్లు తెలిపారు. తిరుమలలో ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా తెచ్చిన క్యూఆర్ కోడ్ విధానం సక్సెస్ అయిందని, దీనిని త్వరలో మరిన్ని చోట్ల అందుబాటులోకి తెస్తామన్నారు. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోందని, భక్తులు సహకరించాలని కోరారు. అడ్వాన్స్డ్, బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులు తిరుపతిలోనే బస చేసి దర్శనానికి రావాలన్నారు. ఇక సెప్టెంబర్ లో 21 లక్షల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, హుండీ కానుకలు రూ. 122 కోట్ల మేరకు వచ్చాయని ఈవో తెలిపారు. 

ఎన్టీఆర్ స్టేడియంలో రేపట్నుంచి శ్రీవారి వైభోత్సవాలు
తిరుమలకు రాలేని భక్తులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం నుంచి జరిగే వైభోత్సవాల్లో పాల్గొనవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 15 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోత్సవాల ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమలలో జరిగే స్వామివారి ప్రతి పూజ ఇక్కడ జరుగుతుందన్నారు. రోజూ 10 వేల మంది కూర్చుని పూజలు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఉచిత ప్రవేశంతో పాటు టీటీడీ లడ్డూ ప్రసాదం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైభోత్సవాల నిర్వహణ దాతలు హర్ష ఆటో గ్రూప్ ఎండీ  హర్షవర్ధన్, ఎండీ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.