విజయాన్ని అడ్డుకునేందుకు కుట్ర: 5.3 ఓవ‌ర్లు వేసేందుకు 53 నిమిషాలు!

విజయాన్ని అడ్డుకునేందుకు కుట్ర: 5.3 ఓవ‌ర్లు వేసేందుకు 53 నిమిషాలు!

'ప్రత్యర్థి విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు' ఇలాంటి కుయుక్తులు ఎక్కువుగా గల్లీ క్రికెట్‌లో కనిపిస్తుంటాయి. ఓటమి అంచన ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేసేందుకు వైడ్లు విసరడం లేదంటే ప్రత్యర్థి ఆటగాళ్లతో తగువులాడటం కామన్. అంతకూ కాదంటే వ్యూహాలు రచిస్తున్నట్లు పదే పదే డిస్కషన్ పెట్టడం. ఈ విధంగా చేస్తేనే కదా! మ్యాచ్ ఆపేద్దాం అంటారు. మరి అలాంటి ఘటన దేశవాలీ మ్యాచుల్లో జరిగితే. దేశానికి ఆడే ఆటగాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడితే. అచ్చం అలాంటి ఒకటి సీన్ వెలుగులోకి వచ్చింది.    

5.3 ఓవ‌ర్లు వేసేందుకు 53 నిమిషాలు

సాధారణంగా క్రికెట్‌లో 5 ఓవర్లు బౌలింగ్‌ చేయడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఏదేని అనుకోని ఘటన జరిగితే.. మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ 5 ఓవర్లు బౌలింగ్‌ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకున్నారంటే.. ఎంత సమయం వృథా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన దేశవాళీ టోర్నీ అయిన దులీప్‌ ట్రోపీ సెమీఫైనల్‌లో చోటుచేసుకుంది.

దులీప్‌ ట్రోపీలో భాగంగా నార్త్‌జోన్‌, సౌత్ జోన్ జ‌ట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నార్త్ జోన్.. సౌత్ జోన్ ముంగిట 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో సౌత్ జోన్ 183/4 పరుగుల వద్ద ఉన్న‌ప్పుడు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. ఆపై కాసేపటి తరువాత తిరిగి ఆట ప్రారంభం కాగా.. నార్త్ జోన్ ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి మరిచిపోయి దారుణంగా వ్య‌వ‌హ‌రించారు. 

మ్యాచ్ 'డ్రా' అయితే ఫైనల్ చేరే అవకాశం

ముఖ్యంగా ఆ జ‌ట్టు కెప్టెన్ జ‌యంత్ యాద‌వ్ బంతి బంతికి ఫీల్డింగ్‌ను మారుస్తూ స‌మ‌యాన్ని వృథా చేసేందుకు అన్ని విధాలాప్ర‌య‌త్నించారు. వ‌ర్షం కార‌ణంగా మరోసారి అంతరాయం కలిగిస్తే ఆట నిలిచిపోయే అవ‌కాశం ఉందని బావించి అలాంటి చర్యలకు పాల్పడ్డారు. మ్యాచ్ 'డ్రా'గా ముగిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం(3 పరుగులు) సాధించిన నార్త్ జోన్ జ‌ట్టు ఫైన‌ల్‌ చేరే అవ‌కాశం ఉండేది. దీంతో కావాల‌నే అలా స‌మ‌యాన్ని వృథా చేశారు. అయిన‌ప్ప‌టికి సౌత్ జోన్ 36.1 ఓవ‌ర్ల‌లోనే లక్ష్యాన్ని ఛేదించి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 

మయాంక్‌ అగర్వాల్‌ (54), కెప్టెన్‌ హనుమ విహారి (43), రికీ భుయ్‌ (34), తిలక్‌ వర్మ (25) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కావాలనే సమయాన్ని వృధా చేసినందున నార్త్‌ జోన్ కెప్టెన్‌ జయంత్‌ యాదవ్‌ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రీడా స్ఫూర్తి అంటే ఇదేనా అని క్రికెట్ అభిమానులు అతన్ని ప్రశ్నిస్తున్నారు.