తీన్మార్​ మల్లన్న అబద్ధాలు చెప్తున్నరు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

తీన్మార్​ మల్లన్న అబద్ధాలు చెప్తున్నరు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తన భార్య నీలిమకు కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆమె 1992లోనే అప్పటి ఏపీఎస్ఈబీలో అసిస్టెంట్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగం సాధించారని తెలిపారు.

2015లో డీఈగా ప్రమోషన్ వచ్చిందని, 2016 నుంచి 2020 వరకు వేతనం తీసుకోకుండా సెలవులో ఉన్నారని, ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగం వదిలిపోయిందనే ప్రచారంలో నిజం లేదని వెల్లడించారు. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

మల్లన్న తనపై రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారని, మళ్లీ ఇప్పుడు పోటీ చేయాలనే ఆలోచనతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోదరుడు తమ విద్యాసంస్థలకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. అలాగే, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా తమ విద్యాసంస్థలకు వచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించారు.