హైదరాబాద్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ముసరాంబాగ్ క్రాస్ రోడ్డు (TV టవర్ వద్ద) దగ్గర మంగళవారం రాత్రి జరిగిన ఈ భయానక రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న లారీని, అస్మాన్‌ఘడ్ గడ్డపై నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ అదుపు తప్పి డివైడర్ను దాటి ఢీకొంది. టిప్పర్ డ్రైవర్ వాహనం వదిలి పరారైనట్లుగా సమాచారం. ఈ ఘటనలో టిప్పర్.. లారీతో పాటు మధిర వెళ్తున్న RTC బస్సు, ఒక కారును ఢీ కొనడంతో నాలుగు వాహనాలు ధ్వంసం కావడం జరిగింది.
బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులను మరో RTC బస్సులో పంపించేశారు. అదృష్టవశాత్తూ రాత్రి సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ, ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు బయలుదేరడంతో, ప్రమాద స్థలంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అయ్యాయా? లేక డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణాల్లో మలక్‌పేట్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
