సాయంత్రం 6 తర్వాత తిరుమల అలిపిరి మార్గం మూసి వేస్తారా.. టీటీడీ ఆలోచన ఏంటీ..

సాయంత్రం 6 తర్వాత తిరుమల అలిపిరి మార్గం మూసి వేస్తారా.. టీటీడీ ఆలోచన ఏంటీ..

తిరుపతి -నుంచి తిరుమలకు ఏడు కొండల స్వామి దర్శనానికి.. మొక్కు చెల్లించుకోవటం కోసం కోట్ల మంది భక్తులు.. నిత్యం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళుతూ ఉంటారు. తిరుమలకు నడిచి వెళ్లటానికి రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి, రెండోది శ్రీవారి మెట్టు. అలిపిరి మార్గం 24 గంటలూ తెరిచే ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గం మాత్రం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఆ మార్గంలో జంతువు సంచారం ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పటి నుంచో ఈ టైమింగ్స్ అమలు అవుతున్నాయి.

అయితే అలిపిరి మెట్ల మార్గంలో నెల రోజుల వ్యవధిలో.. రెండు సార్లు చిరుత పులల దాడి జరిగింది. మొన్నటికి మొన్న నాలుగేళ్ల చిన్నారిని పులి ఎత్తుకెళ్లగా.. స్థానికులు అందరూ కలిసి కాపాడారు. ఇప్పుడు మాత్రం విషాదంగా మారింది. ఆరేళ్ల లక్షిత పులికి బలయ్యింది. వరసగా జరుగుతున్న సంఘటనలతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే మెట్ల మార్గంలో భక్తుల భద్రత, రక్షణపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైనే ఈవో ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆలోచనలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. 

అలిపిరి మెట్ల మార్గాన్ని కూడా సాయంత్రం ఆరు గంటలకు మూసివేసే ప్రతిపాదన, ఆలోచనపై లోతుగా చర్చిస్తున్నట్లు తెలిపారు ఈవో ధర్మారెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాన్ని సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని ఫారెస్ట్ అధికారులు.. టీటీడీ అధికారులకు సూచించారు.   ప్రస్తుతం 24 గంటలూ కాలిబాటలో  తిరుమల కొండకు చేరుకునే అవకాశం ఉంది.  వన్య ప్రాణుల సంచారంతో శ్రీవారి భక్తులకు ఆంక్షలు విధించే విధంగా ఫారెస్టు అధికారులు నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం అలిపిరి మెట్ల మార్గంలోనూ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే భక్తులకు అనుమతి ఉండేదని.. తర్వాత భక్తుల రద్దీ, విజ్ణప్తుల మేరకు 24 గంటలూ ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు పులుల సంచారంతో 24 గంటలూ కాలిబాట మార్గంలో భద్రతా ఏర్పాట్లు, రక్షణ చర్యలు చేపట్టటం కష్టంగా ఉండటంతో.. తిరిగి పాత విధానంలో.. సాయంత్రం ఆరు గంటలకే అలిపిరి మెట్ల మార్గాన్ని మూసివేయాలనే ఆలోచనపై టీటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.

అలిపిరి మెట్ల మార్గంలో బాటకు రెండు వైపుల కంచె ఏర్పాటుకు అటవీ చట్టం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీంతో కాలిబాట సమయాన్ని కుదించాలనే ఆలోచన వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో.. ప్రతి రోజూ 25 వేల మంది భక్తులు.. నడుస్తూ తిరుమల కొండ చేరుకుంటున్నారు... 
అయితే మొదట ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతిచ్చారు.   కొంతకాలం తరువాత భక్తుల కోరిక మేరకు 24 గంటలు మెట్ల మార్గంలో  భక్తులను అనుమతించారు. మరి ఇప్పుడు వన్య ప్రాణులు దాడులు జరుగుతున్నాయి కాబట్టి టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.