తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా..!

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా..!

సూర్య భగవానుడి పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో ఆదివారం ( జనవరి 25)  రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. 

ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు జరిగే రథసప్తమి వేడుకల్లో  శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై  భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం... మినీ బ్రహ్మోత్సవం.... ఒకరోజు బ్రహ్మోత్సవంగా.... పిలుస్తుంటారు.

ఎప్పుడు మొదలయ్యాయంటే..

తిరుమలలో క్రీ.శ 1564 నుండి రథసప్తమి వేడుకలు  జరుపుతున్నట్లుగా ఆధారాలున్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు పలు  వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తాడు. సూర్యప్రభ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ అంటారు. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే... అందుకే సూర్యుడిని  సూర్యనారాయణుడు అని కొలుస్తారు. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

బాలమందిరం విద్యార్థులచే ఆదిత్య హృదయం... సూర్యాష్టకం

రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఈ శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం, వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు  జ్యోతుల నెహ్రూ,  ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి,  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి,  ఎన్. సదాశివరావు, శ్రీ నరేష్ ,  శాంతా రామ్,  జానకి దేవి,  దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. టీటీడీ అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి ,జేఈఓ  వీరబ్రహ్మం, సీవీఎస్వో  మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ  సుబ్బరాయుడులతో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యవేక్షించారు...