భక్తులతో తిరుమల కిటకిట: శిలాతోరణం వరకు క్యూలైన్లు.. సర్వదర్శనానికి 24 గంటలు

భక్తులతో తిరుమల కిటకిట: శిలాతోరణం వరకు క్యూలైన్లు.. సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తుల జనసందోహంతో పోటెత్తింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో దేశం నలుమూలల నుండి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తిరుమాడ వీధులు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి బయట ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఆ శ్రీనివాసుని దర్శనం కోసం ఓపికగా వేచి ఉన్నారు.

భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటంతో టోకెన్లు లేని ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు.

మరోవైపు టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం పూర్తి కావడానికి దాదాపు 8 గంటల సమయం పడుతోందని టీటీడి అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 78వేల 389 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 45వేల 283 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తుల రద్దీ కారణంగా తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4కోట్ల 15లక్షలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. భక్తుల తాకిడితో లడ్డూ ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఒక్కరోజే ఏకంగా 4 లక్షల 7 వేల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు వెళ్లడించారు. రాబోయే 2 రోజులు కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.