హన్మకొండ సిటీ, వెలుగు : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి తన వైఖరి స్పష్టం చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన బిల్లు, సవరణ బిల్లు, జీవో వంటి అన్ని ప్రయత్నాలు విఫలమైనందున.. ప్రభుత్వం తీసుకునే ప్రత్యామ్నాయాలని తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ల సాధనకు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించిన అంశాలను సీఎంకు లేఖ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో పాటు ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ నాయకులు దారబోయిన సతీశ్, నూతనకంటి ఆనందం, బుట్టి శ్యాంయాదవ్, ఎదునూరి రాజమౌళి, సోమిడి అంజన్‌రావు, చిన్నాల యశ్వంత్‌యాదవ్, డాక్టర్ పాలడుగుల సురేందర్, దాడబోయిన శ్రీనివాస్, డాక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
