గోవాలో తిరుపతి ఆస్పత్రి తరహా ఘటన..26 మంది రోగుల మృతి

 గోవాలో తిరుపతి ఆస్పత్రి తరహా ఘటన..26 మంది రోగుల మృతి

పనాజి: పశ్చిమ తీర రాష్ట్రం గోవాలోని ప్రభుత్వ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసిహెచ్)లో తిరుపతి రుయా ఆస్పత్రి తరహా ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో నిన్న (సోమవారం) రాత్రి 8.30 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం కలగడం వల్ల 11 మంది కన్నుమూసిన విషయం తెలిసిందే. తమ కళ్లముందే ఊపిరి పీల్చుకోవడానికి అవస్థలు పడుతూ.. కళ్లు తేలవేసి తనువు చాలించిన ఘటనలపై మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనై వైద్యులు, వైద్య సిబ్బందిపై తిరగబడి తరిమేయడం సంచలనం రేపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటన రాత్రి 8.30 గంటలకు జరగగా... రోగుల బంధువుల ఆందోళనతో అర్ధరాత్రి వరకు తిరుపతి రూయా ఆస్పత్రిలో రోగులు, వారి బంధువుల ఆర్తనాదాలు.. కేకలతో దద్దరలిల్లిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు గోవా ఆస్పత్రిలో తిరుపతి తరహా సీన్
గోవా రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రిలో అర్ధరాత్రి 2 గంటలకు సేమ్ సీన్ ఏర్పడింది. ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో రోగులు విలవిలలాడిపోయారు. ఆక్సిజన్ కొరత లేదని వైద్యులు, అధికారులు చెబుతున్నా.. అంతరాయం కలగడంతో కరోనా రోగులు క్షణమొక యుగంల విలవిలలాడుతూ..  తుదిశ్వాస విడిచారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం రోగులు, వారి బంధువుల్లో భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం తెల్లవారాకా 6 గంటల వరకు ఆస్పత్రిలో ప్రతి 10 నిమిషాలకు ఒకరిద్దరు చొప్పున మొత్తం 26 మంది తుదిశ్వాస విడిచారు. తమ వారంతా ఒకరితర్వాత ఒకరు చనిపోతుండడంతో ఆస్పత్రిలోని రోగుల బంధువులు, ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన రోగులు.. వారి తాలూకు వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు కారణాలు స్పష్టంగా తెలియడం లేదని.. లోతుగా విచారణ చేసి వాస్తవాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని గోవా రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. ప్రమాదంపై తీవ్ర భయాందోళనలు చెలరేగడంతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రిని సందర్శించి రోగులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా కొరత లేకపోయినా ఈ ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. కొన్ని సమయాల్లో  సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. గోవా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో వైద్య ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉందని ఆరోగ్య మంత్రి విశ్వజీత్‌ రాణే సోమవారమే చెప్పారు. నిన్న ఆసుపత్రిలో 1,200 జంబో సిలిండర్లు అవసరం ఉండగా కేవలం 400 మాత్రమే సరఫరా చేయబడ్డాయి అని తెలిపారు.