పేలిపోయిన ‘టైటాన్’ ...ఐదుగురు దుర్మరణం

పేలిపోయిన ‘టైటాన్’ ...ఐదుగురు దుర్మరణం
  • అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటన  
  • గల్లంతైన రోజే ఘటన

బోస్టన్: టైటాన్ మినీ జలాంతర్గామి పేలిపోయింది. అందులోని ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ మేరకు యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. టైటానిక్ ఓడ మునిగిపోయిన ప్రాంతంలోనే టైటాన్ శకలాలను గుర్తించామని తెలిపింది. దానికి దగ్గర్లోనే టైటాన్ పేలిపోయిందని చెప్పింది. ఈ విషయాన్ని చనిపోయినోళ్ల కుటుంబసభ్యులకు తెలియజేశామని ఫస్ట్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని, అయితే టైటాన్ శకలాలు దొరికే అవకాశం ఉందో లేదో చెప్పలేమని పేర్కొన్నారు. కాగా, టైటాన్ జలాంతర్గామి గల్లంతైన కొన్ని గంటలకే పేలిపోయిందని రిపోర్టులను బట్టి తెలుస్తోంది. ‘‘ఆదివారం టైటాన్ మిస్ అయిన కొద్దిసేపటికే పేలుడు శబ్దాలు వచ్చాయి. సబ్ మెరైన్ లను పసిగట్టేందుకు వినియోగించే అకౌస్టిక్ మానిటరింగ్ సిస్టమ్ వాటిని గుర్తించింది” అని అమెరికా నేవీ అధికారి ఒకరు చెప్పారు. అయితే టైటాన్ లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉండడం, అది పేలిపోయిందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అమెరికాకు చెందిన ఓషన్ గేట్ కంపెనీ మునిగిపోయిన టైటానిక్ శకలాలను చూపించేందుకు ఈ యాత్ర చేపట్టింది. ఐదుగురితో టైటాన్ జలాంతర్గామి ఆదివారం ఉదయం న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే టైటాన్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అమెరికా, కెనడా, ఫ్రెంచ్ సిబ్బంది వాళ్లను కాపాడేందుకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 

ఎట్ల పేలింది? 

సముద్రంలో 3,800 మీటర్ల లోతు నుంచి టైటానిక్ శకలాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో పీడనం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ‘‘చాలా వరకు జలాంతర్గాములు, మినీ జలాంతర్గాముల ప్రెజర్ వెస్సెల్ ను ఒకే మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇందుకు టైటానియం లేదా థిక్ స్టీల్ వాడతారు. టైటాన్ ప్రెజర్ వెస్సెల్​ను మాత్రం టైటానియం, కార్బన్ ఫైబర్ లను కలిపి తయారు చేశారు. దీంతో అధిక పీడనాన్ని తట్టుకోలేక టైటాన్ ప్రెజర్ వెస్సెల్ దెబ్బతిని ఉంటుంది. అందులోని వాళ్లు అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే అది పేలిపోయి ఉంటుంది” అని ఎక్స్ పర్ట్స్ చెప్పారు.

చనిపోయింది వీళ్లే... 

స్టాక్టన్ రష్ (61): ఈయన పైలట్. ఓషన్ గేట్ కంపెనీ వ్యవస్థాపకుడు. 2009లో ఈ కంపెనీ పెట్టి మినీ సబ్ మెరైన్ లను తయారు చేశాడు. సముద్రగర్భంలో రీసెర్చ్ చేసే వాళ్లను వాటిల్లో తీసుకెళ్తున్నాడు. 

హమీష్ హార్డింగ్ (58): ఈయన బ్రిటన్ కు చెందిన బిజినెస్ మెన్. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. ‘యాక్షన్ ఏవియేషన్’ అనే ఎయిర్ క్రాఫ్ట్ బ్రోకరింగ్ కంపెనీ ఉంది. ఇప్పటి వరకు మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. నమీబియా నుంచి మన దేశానికి చీతాలను తీసుకొచ్చినప్పుడు ఈయన సాయపడ్డారు. 

షజాదా (48), సులేమాన్ (19): వీళ్లిద్దరూ తండ్రీకొడుకులు. షజాదా దావూద్ పాకిస్తాన్​కు చెందిన బిజినెస్ మెన్. 

పాల్ హెన్రీ నార్జియోలెట్ (77): ఈయన ఫ్రెంచ్ మాజీ నేవీ ఆఫీసర్. ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీలో డైరెక్టర్. ఇప్పటివరకు 37 సార్లు టైటానిక్ ఓడ శకలాల దగ్గరికి వెళ్లొచ్చారు.