ఇక ఇండ్లు, ప్లాట్లకు టైటిల్! పట్టాభూముల మాదిరిగానే ఓనర్లకు యాజమాన్య హక్కులు

ఇక ఇండ్లు, ప్లాట్లకు టైటిల్! పట్టాభూముల మాదిరిగానే ఓనర్లకు యాజమాన్య హక్కులు
  •  ఎవరి పేరు మీద, ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉందో  టైటిల్ ఇచ్చే యోచన
  • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ
  • ప్రక్షాళన దిశగా సర్కారు అడుగులు
  • పట్టాభూముల మాదిరిగానే ఎవరి పేరు మీద, ఎక్కడ, 
  • ఎంత విస్తీర్ణంలో ఉందో టైటిల్ ఇచ్చే యోచన
  • డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల
  • అన్యాక్రాంతానికి చెక్​పెట్టేలా బ్లాక్​ చైన్​ టెక్నాలజీ
  • ప్రతిపాదనలు రెడీ చేస్తున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్​, వెలుగు:స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇన్నాళ్లూ వ్యవసాయ భూములకే పరిమితమైన ‘పట్టా’ లేదా ‘టైటిల్’ విధానాన్ని ఇకపై ఇండ్లు, ఇండ్ల స్థలాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా యజమానుల పేరు మీద పక్కాగా ‘టైటిల్’ (యాజమాన్య హక్కు పత్రం) ఇవ్వాలని భావిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వరుసగా వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం లాంటి ఘటనలను సర్కారు సీరియస్ గా తీసుకున్నది.  

ముఖ్యంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివాదాలు పెద్ద ఎత్తున కోర్టులకు ఎక్కుతుండటం, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే  సర్కారు ఆదేశాల మేరకు రెవెన్యూ, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్​ శాఖల ఉన్నతాధికారులు  ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా అవినీతికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ని వినియోగించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ సాంకేతికత ద్వారా ఒకసారి ఆస్తి వివరాలు నమోదైతే, వాటిని మార్చడం లేదా ట్యాంపర్ చేయడం అసాధ్యం. 

ఒకసారి ఒక వ్యక్తికి రిజిస్టర్ అయిన ఆస్తిని, మళ్లీ వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి (డబుల్ రిజిస్ట్రేషన్) సిస్టమ్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. అలాగే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఇతర నిషేధిత జాబితాలోని ఆస్తుల వివరాలను ఈ టెక్నాలజీలో నిక్షిప్తం చేయడం ద్వారా, వాటిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే సాఫ్ట్‌‌‌‌వేర్ వెంటనే తిరస్కరిస్తుంది. తద్వారా సబ్ రిజిస్ట్రార్ల ప్రమేయం లేకుండానే అక్రమాలను అడ్డుకోవచ్చు. 

డబుల్ రిజిస్ట్రేషన్ల బెడదను, ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించేందుకు ‘సర్వే నంబర్ బ్లాక్’ విధానాన్ని కూడా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఒక సర్వే నంబర్లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఎంత? అందులో ఇప్పటికే ఎంత రిజిస్ట్రేషన్ జరిగింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే లెక్కలను ఈ సిస్టమ్ ఎప్పటికప్పుడు పసిగడుతుంది. సర్వే నంబర్లో ఉన్న భూమి కంటే ఒక్క గజం కూడా ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినా, ఆ సాఫ్ట్‌‌‌‌వేర్ ఆటోమేటిక్‌‌‌‌గా లావాదేవీని నిలిపివేస్తుంది. 

రోడ్లు, పార్కుల లెక్క పక్కా

రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో జరుగుతున్న మోసాలకు కూడా కొత్త విధానంలో అడ్డుకట్ట వేయాలని సర్కారు భావిస్తున్నది.  ప్రస్తుతం లే అవుట్లలో రోడ్లు, పార్కులులాంటి మౌలిక సదుపాయాల స్థలాలను స్పష్టంగా డిక్లేర్ చేయకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. సాధారణంగా 10  ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమి (నాలా) కింద మారిస్తే అందులో రోడ్లు, పార్కులకు స్థలం వదలాల్సి ఉన్నా, ఆ స్థలాన్ని కూడా ప్లాట్లుగా మార్చేసి అమ్ముకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదరు సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూమి ఎంత? అమ్ముతున్నది ఎంత? అనే లెక్కలు ఇకపై పక్కాగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. 

లే అవుట్‌‌‌‌లోని రోడ్లు, పార్కులను ముందే డిక్లేర్ చేసి, మిగిలిన ప్లాట్ల విస్తీర్ణం వాస్తవ భూమికి సరిపోయేలా ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరిగేలా సాఫ్ట్‌‌‌‌వేర్ లో మార్పులు చేయనున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఉంటారు. అందులో భాగంగానే వ్యవసాయ భూములకు ప్రస్తుతం అమల్లో ఉన్న పట్టాదార్ పాసుపుస్తకాల విధానం మాదిరిగానే, ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా అధికారికంగా టైటిల్ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. 

ప్రస్తుతం కేవలం రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఆస్తికి ఆధారంగా ఉంటున్నది. నిజానికి రిజిస్ట్రేషన్​అనేది అమ్మకందారు, కొనుగోలుదారు మధ్య ఆస్తి అమ్మకానికి ఒప్పంద పత్రమే తప్ప యాజమాన్య ధ్రువీకరణ పత్రం కాదు. కానీ భవిష్యత్తులో ఎవరి పేరు మీద? ఎక్కడ? ఎంత? విస్తీర్ణంలో ఆస్తి ఉంది? అనే పూర్తి వివరాలతో కూడిన టైటిల్ ఇవ్వడం వల్ల ఆస్తిపై యజమానికి పూర్తి హక్కులు, భద్రత ఉండడమే గాక అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఆస్తి తగాదాలు సగానికి పైగా తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తున్నది.

అవినీతి కోరల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు!

కొన్నేండ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ గా మారాయన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల కుమ్మక్కుతో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులపాలవడం, ఒకే ప్లాట్‌‌‌‌ను ఇద్దరు, ముగ్గురికి అమ్మడం నిత్యకృత్యమైంది. దీని ఫలితంగా కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సివిల్ తగాదాల వల్ల శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి, టెక్నాలజీ ఆధారిత పారదర్శక వ్యవస్థను తీసుకురావడమే ఏకైక పరిష్కారమని ప్రభుత్వం భావిస్తున్నది.

1983 నుంచి ఈసీల అనుసంధానం.. లింక్ డాక్యుమెంట్లపై నిఘాఆస్తుల చరిత్రను క్షుణ్నంగా పరిశీలించేందుకు 1983 నుంచి ఉన్న ఎన్‌‌‌‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) వివరాలను కొత్త విధానానికి అనుసంధానించనున్నారు.  కేవలం ప్రస్తుత యజమాని వివరాలే కాకుండా.. గత 40 ఏండ్లుగా ఆ ఆస్తి ఎవరెవరి చేతులు మారింది? లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని అధికారులు నిర్ధారించుకుంటారు. 

దీనివల్ల నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులు అమ్మే ముఠాల ఆటలు సాగవు. లింక్ డాక్యుమెంట్ల సరైన క్రమం లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిచిపోయేలా చర్యలు తీసుకోనున్నారు. పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే ఆస్తి చరిత్ర మొత్తం కండ్లకు కట్టినట్టు కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.