మన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం

మన  సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ దీక్ష సాగించారు. కృష్ణ జలాల్లో  రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని కోదండరాం అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న జలవనరుల దోపిడీని అరికట్టాలన్నారు.  రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లైనా నీటి వాటాలు తేల్చకపోవడం దురదృష్టకరమన్నారు. ట్రిబ్యునల్ వేసి రాష్ట్ర వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. కృష్ణా తీర ప్రాంతం 78శాతం తెలంగాణలో ఉందని.. కానీ రాష్ట్రానికి 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వరద జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు నడుస్తున్నాయన్నారు. 

కేంద్రం ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల 28 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఆగిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ఆంధ్రాలో కూడా పోటీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర సమస్యలపై పోరాటం చేయడంలేదని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్ లో  కేసీఆర్ పాలనపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. విభజన చట్టంలోన10వ షెడ్యూల్ లో కీలక అంశాలు ఉన్నాయని.. 9 ఏళ్లుగా వాటిపై దృష్టి పెట్టలేదని కోదండరాం విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పారిశ్రామిక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడంతో కేంద్రం పట్టించుకోలేదన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఏ అంశం అమలుకాలేదన్నారు.