- కమిషన్ ఏర్పాటు చేసి, ఇండ్ల స్థలాలు ఇవ్వండి
- మంత్రి వివేక్‌ను కోరిన కోదండరాం
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని టీజేఎస్ చీఫ్ కోదండరాం కోరారు. వారి సంక్షేమం కోసం ఏం చేయాలన్న అంశాలపై అధ్యయనం చేయటానికి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని, వారి కుటుంబ సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలోని మంత్రి వివేక్ నివాసంలో ఉద్యమకారులతో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వివేక్‌తో కోదండరాం మాట్లాడారు. ‘‘మంత్రులందరినీ కలిసి వినతిపత్రం అందజేస్తాం.
కేబినెట్లో ఉద్యమకారుల సంక్షేమంపై చర్చించాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలకం. వేలాది మంది యువత ప్రాణ త్యాగాల కారణంగానే తెలంగాణ వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు. నిర్లక్ష్యం చేసింది. ఉద్యమకారులను ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది.
ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉద్యమకారులకు కలిగింది. కొంత మంది ఇటీవల సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందుకోవడం అభినందనీయం’’అని కోదండరాం గుర్తు చేశారు. లక్షలాది మంది యువత తమ ఉద్యోగాలు, కుటుంబాలను వదిలి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. సబ్బండ వర్గాల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటైందని కోదండరాం గుర్తు చేశారు.
