
వివిధ రంగాల్లో కేటాయించిన బడ్జెట్ నిధులు తనకు నిరాశ కలిగించాయన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడుతూ.. ప్రతి ఏటా అప్పులు పెరిగిపోతున్నాయని, 2014 -15 సంవత్సరంలో 9,500 కోట్ల అప్పుల నుంచి 2017- 18 కి 49 వేల కోట్లకు అప్పు పెరిగిందని చెప్పారు. ఈ సారి కూడా దాదాపుగా 35 వేల కోట్లు అప్పు చేసే అవకాశం ఉందని, దీంతో వడ్డీల శాతం విపరీతంగా పెరిగిపోతుందని అన్నారు.
నిరుద్యోగ సమస్య పై కేసీఆర్ చేతులెత్తేశారని , నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం బాగా నిరాశ కలిగించిందని కోదండరాం అన్నారు. వైద్య రంగానికి పెద్దగా పెంపు లేదని విమర్శించారు. రుణమాఫీ విషయంలో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని రైతులు , రైతు సంఘాలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
బడ్జెట్ కేటాయింపుల్లో 33 శాఖలలో భారీగా కోతలు విధించారని తెలిపారు, ఈ సారి వృద్ది రేటు పడిపోయింది కాబట్టి సంక్షేమ పథకాల్లో భారీగా కోత పడే ప్రమాదం ఉందని, కేటాయించిన నిధుల్లో కూడా భారీగా కోతలు తప్పవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో కేటాయించిన ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 50 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు కోదండరాం. గత బడ్జెట్ లో ఎంబిసి కి వెయ్యి కోట్ల కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఈ సారి కేటాయించిన 500 కోట్లను కూడా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదని అన్నారు కోదండరాం. బడ్జెట్ విషయాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు.