- ఎవరూ బలిదానాలు చేసుకోవద్దు: కోదండరాం
హైదరాబాద్, వెలుగు : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని, ఎవరూ ఆత్మబలిదానాలకు పాల్పడొద్దని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వర్ చారికి శనివారం జగద్గిరిగుట్టలో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయి ఈశ్వర్ చారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఎవరూ ఆత్మబలిదానాలకు పాల్పడి కుటుంబాలకు తీరని శోకం మిగల్చొద్దని కోరారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల ప్రాణాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లెక్క లేకుండా పోయిందని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సాయి ఈశ్వర్ చారి మరణంపై సీఎం స్పందించేవారని, తెలంగాణలోనే ఉండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
