మేధావులంతా ఏకమై కేసీఆర్కు బుద్ధి చెప్పాలె

మేధావులంతా ఏకమై కేసీఆర్కు బుద్ధి చెప్పాలె

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో ఉద్యోగులు ఆగమయ్యారని టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమయానికి జీతాలు రాక ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ పత్రిక అధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల మనో ధైర్యం...భవిష్యత్తు కార్యాచరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సర్వీస్ రూల్స్ పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు... నెలాఖరు వరకు కూడా రావడం లేదని ఆరోపించారు. 

ఇక వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందన్న ఆయన... వారిని ఏ శాఖకు కేటాయించకుండా కేసీఆర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ అనేది ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమన్న కోదండరాం... దానికి రెవిన్యూ ఉద్యోగులను బలిచేయడం సరికాదన్నారు.   వీఆర్వో, రెవిన్యూ ఉద్యోగుల సమస్యలపై సీసీఎల్ఏ కార్యాలయం ముట్టడికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొంత మంది మేధావులు అధికారం, డబ్బుకు లొంగిపోయారన్నారు. దీంతో కేసీఆర్ ను ప్రశ్నించేవారు కరువై... తాను ఆడిందే ఆట... పాడిందే పాటగా కేసీఆర్ వ్యవహరిస్తు్న్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బుద్ధిజీవులంతా ఏకమై కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆప్ రాష్ట్ర కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రెవిన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.