NPCI సంచలన నిర్ణయం.. అక్టోబర్ నుంచి UPI యూజర్లకు ఆ సౌకర్యం నిలిపివేత!

NPCI సంచలన నిర్ణయం.. అక్టోబర్ నుంచి UPI యూజర్లకు ఆ సౌకర్యం నిలిపివేత!

UPI News: యూపీఐ పేమెంట్స్ రాకతో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అనేక రకాల కొత్త రకం డిజిటల్ చెల్లింపు మోసాలను ఉపయోగించి ప్రజల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు నేరగాళ్లు. ప్రజల సౌకర్యం కోసం తెచ్చిన సౌకర్యాలను నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్న క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని సౌకర్యాలను తీసేయాలని నిర్ణయించింది. 

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ యూపీఐ చెల్లింపు యాప్స్ యూజర్లకు ప్రస్తుతం వేరే వ్యక్తి నుంచి డబ్బు అవసరమైతే యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసే సౌకర్యం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వ్యక్తి నుంచి వ్యక్తి డబ్బు రిక్వెస్ట్ ఫీచర్లను నిందితులు దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అక్టోబర్ 1, 2025 నుంచి ఆ సౌకర్యాన్ని పూర్తిగా తమ యాప్స్ నుంచి తొలగించాలని బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలను ఆదేశించింది. 

ప్రస్తుతం యూపీఐ యూజర్లు వేరే వ్యక్తి నుంచి డబ్బు రిక్వెస్ట్ చేసేందుకు గరిష్ఠ పరిమితి కేవలం రూ.2వేలుగా ఉన్న సంగతి తెలిసిందే. పైగా రోజుకు ఇలా 50 ట్రాన్సాక్షన్స్ చేసేందుకు మాత్రమే అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేరగాళ్లు దీనిని దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నట్లు గుర్తించబడింది. 

కానీ మనీ రిక్వెస్ట్ చేసే సౌకర్యం వ్యాపారులకు మాత్రం అందుబాటులో ఉంటుందని పేమెంట్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.  ఉదాహరణకు మీరు అమెజాన్, స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్ వంటి యాప్స్ లో ఏదైనా చెల్లింపు చేసేందుకు షాపింగ్ సమయంలో సదరు యాప్స్ పేమెంట్ లింక్స్ పంపిస్తుంటాయి. పిన్ అథెంటికేషన్ ఇస్తేనే పేమెంట్ పూర్తవుతుంది. కేవలం వ్యక్తి నుంచి వ్యక్తి పేమెంట్ కలెక్షన్ ఫీచర్ మాత్రమే నిలిపివేయబడనుంది. కానీ మర్చంట్ నుంచి పర్సన్ పేమెంట్ కలెక్షన్ సౌకర్యం మాత్రం యథావిథిగా కొనసాగనుంది.