బెయిల్‌‌ షరతులతో.. వ్యక్తి రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోవద్దు : సుప్రీం కోర్టు

బెయిల్‌‌ షరతులతో.. వ్యక్తి రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోవద్దు : సుప్రీం కోర్టు
  • ఒడిశా హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసిన సుప్రీం

న్యూఢిల్లీ: బెయిల్‌‌ షరతులతో ఓ వ్యక్తిని రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కోర్టులు అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి షరతులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని వెల్లడించింది. ఒడిశాలోని బహరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ సిబా శంకర్ దాస్ పై పలు కేసులు ఉన్నాయి. దాంతో ఆయన ఒడిశా హైకోర్టు ద్వారా  బెయిల్ పొందారు. అయితే..ఆ బెయిల్ లో కోర్టు ఒక షరతు విధించింది. బయటకు వెళ్లాకా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సిబా శంకర్ దాస్ కు కండీషన్ పెట్టింది.

దాంతో అతను తనకు ఇచ్చిన బెయిల్ నుంచి ఆ కండీషన్ తొలగించాలని 2022 ఆగస్టు 11న హైకోర్టును ఆశ్రయించాడు. ఆ అప్పీలును హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  సిబా శంకర్ దాస్  ఈ ఏడాది జనవరి 18న సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్ ను ఈ నెల 22న న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ విచారించింది. శంకర్ దాస్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..తన క్లయింట్ పొలిటీషన్ అని..వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతించాలని కోర్టును కోరారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ..ఒడిశా హైకోర్టు ఇచ్చిన బెయిల్ షరుతు లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. అలాంటి షరతు విధించడం వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని చెప్పింది. శంకర్ దాస్ కు ఒడిశా హైకోర్టు విధించిన బెయిల్ షరతును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.