భారతదేశ రాజకీయ చరిత్రలో భారతరత్న అటల్ బిహారి వాజ్పేయి గొప్ప రాజకీయవేత్త. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి, రాజనీతిజ్ఞుడు, దేశభక్తుడు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జన్మించారు వాజ్పేయి. ఆయన తండ్రి కృష్ణ బిహారి వాజ్పేయి ఉపాధ్యాయుడు, కవి, తల్లి కృష్ణాదేవి. చిన్ననాటి నుంచే వాజ్‌పేయికి దేశభక్తి, సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. గ్వాలియర్, కాన్పూర్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావంతో దేశసేవ మార్గాన్ని ఎంచుకున్నారు. వాజ్పేయి భారతీయ జన్‌సంఘ్ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1957లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన ప్రసంగ శైలి, ప్రతిపక్షాలపై గౌరవంతో మాట్లాడే తత్వం ఆయనకు విశేష గుర్తింపు తెచ్చింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
నైతిక రాజకీయాలు
అధికార రాజకీయాల కంటే విలువల రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం ఒక్క ఓటుతో అధికారాన్ని పోగొట్టుకున్నా.. ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాలుపడలేదు. అది కేవలం వాజ్ పేయికే సాధ్యం. భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీని స్థాపించి సిద్ధాంతాలను, విధానాలను పరిచయం చేసి, విలువల ఆధారిత రాజకీయాల బలోపేతానికి కృషి చేశారు. ఆయన దూరదృష్టి ఫలితంగా దేశం వికసిత్ భారత్ దిశగా ముందడుగు వేసింది. 1984 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కేవలం రెండు సీట్లే దక్కాయి. పార్టీకి ప్రజాదరణ పెంచి ఐదేళ్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని అందించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. వాజ్పేయి ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక జాతీయ నాయకుడిగా ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు.
రాజకీయాల కన్నా దేశ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు అడిగిన వెంటనే ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ దుర్బుద్ధిని
ఎండగట్టారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ విధానాలను బలంగా ప్రపంచానికి తెలియజేశారు.
చారిత్రాత్మకమైన విజయాలు
ప్రధానమంత్రిగా వాజ్పేయి అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించారు. ఆయన ఎంత సున్నితమైన వ్యక్తి అయినా దేశ ప్రయోజనాల పట్ల చాలా దృఢంగా వ్యవరించారు. పోఖ్రాన్ అణు పరీక్షలు (1998) ద్వారా భారత్‌ను అణుశక్తిగా నిలబెట్టారు. ఆగ్రా చర్చలు, లాహోర్ బస్సుయాత్ర ద్వారా భారత్–పాకిస్థాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ఆయన దౌత్యనీతికి నిదర్శనాలు. స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టు ద్వారా జాతీయ రహదారులు, దేశ మౌలిక వసతులు, విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి పునాది వేశారు. ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాలను రహదారులతో అనుసంధానించారు. టెలికాం, ఐటీ రంగాల అభివృద్ధికి బలమైన పునాది వేశారు. అఖండ దేశభక్తి, నమ్మిన సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం, కలుపుకుపోయే మనస్తత్వం వాజ్పేయి వ్యక్తిత్వాన్ని హిమాలయాలను మించేలా చేశాయి. ‘ఇండియా షైనింగ్’ అనే ఆలోచన ఆయన దూరదృష్టికి నిదర్శనం.
జీవనతత్వం ఆయన కవిత్వం
కవిగా వాజ్పేయి హృదయాన్ని హత్తుకునే రచనలు చేశారు. దేశభక్తి, మానవతావాదం, జీవనతత్వం ఆయన కవిత్వంలో ప్రతిఫలిస్తాయి. రాజకీయాలలో కఠిన
నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఆయన ఎంతో సౌమ్యుడు, అటల్ బిహారి వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన జీవితం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం... రాజకీయాలు అధికారానికి కాదు, ప్రజాసేవే పరమావధి అనే భావన. నేటి తరానికి ఆయన జీవితం ఒక ప్రేరణ. రేపటి నాయకులకు ఒక మార్గదర్శకుడు. అటల్ జీ ఆలోచనలు, ఆదర్శాలు చిరకాలం భారతదేశాన్ని వికసిత్ భారత్ దిశగా మలిచేదిశలో కొనసాగాయి. వాజ్పేయి జీవితం భారతీయ యువతకు ఒక ఆదర్శం. ఆయన చూపిన మార్గం దేశసేవ. నేటికీ ఆయన ఆలోచనలు, ఆశయాలు భారతదేశ అభివృద్ధికి శాశ్వత మార్గదర్శకాలు.
ప్రధానమంత్రిగా
విశిష్ట ప్రజాసేవ
అటల్ బిహారి వాజ్పేయి మూడుసార్లు భారతదేశ ప్రధానమంత్రిగా (1996, 1998–2004) బాధ్యతలు నిర్వహించారు. ఆయన పాలనాకాలం భారతదేశ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచింది. వాజ్పేయి శత జయంతిని జరుపుకోవడం అంటే భారత ప్రజాస్వామ్య విలువలను గౌరవించడమే. సర్వసమ్మత రాజకీయాలను, పాలనాదక్షతతో కర్తవ్య నిర్వహణలో బాధ్యత, దేశాభివృద్ధి దిశగా దృఢ సంకల్పంతో, సుపరిపాలనకు నిజమైన నిర్వచనం చెప్పిన మహానేత. వాజ్‌పేయికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం మన నైతిక ధర్మం. వాజ్ పేయి రాజకీయ జీవితం సూత్రబద్ధత, నైతికత, సంయమనం అనే విలువలకు ప్రతీకగా నిలిచింది. విభిన్న భావజాలాల మధ్య సమన్వయం సాధిస్తూ, అధికార, ప్రతిపక్షాల గౌరవాన్ని కూడా సంపాదించిన అరుదైన నాయకుడు ఆయన. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తాయి. మాటలలో మాధుర్యం, ఆలోచనల్లో స్పష్టత, చర్యల్లో ధైర్యం ఆయన ప్రత్యేకత.
- ఆలె భాస్కర్,
రాష్ట్ర బీజేపీ
నాయకుడు
