కష్టాలను అధిగమించి... హీరోగా ఎదిగి

కష్టాలను అధిగమించి... హీరోగా ఎదిగి

ఆయనొక నటుడు.. కాదు సంగీత దర్శకుడు.. అదీ కాదు గాయకుడు.. అంతేకాదు లిరిసిస్ట్.. అది మాత్రమే కాదు ఆడియో ఇంజినీర్.. అలాగే మంచి ఎడిటర్.. అభిరుచి గల నిర్మాత కూడా. ఇప్పుడా లిస్టులో డైరెక్షన్ కూడా చేరింది. ఒకటికి రెండు పనులు చేయడానికే ఇబ్బందిపడే మనుషులున్న ఈ రోజుల్లో ఒకేసారి ఇన్ని పనులు చేయడం ఆయనకే చెల్లింది. మల్టీ టాలెంట్స్‌తో తమిళనాటే కాదు తెలుగులోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన మరెవరో కాదు.. విజయ్ ఆంటోనీ. ఇవాళ విజయ్ ఆంటోనీ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ స్పెషల్ స్టోరీ. 
    
‘బిచ్చగాడు’తో లైమ్ లైట్ లోకి.. 

‘బిచ్చగాడు’.. ఇదేం పేరు, ఇంకేం దొరకలేదా అన్నారు చాలామంది. సినిమా కూడా పేరుకు తగ్గట్టే ఉంటుందిలే అంటూ చూడటమే అనవసరమని తేల్చేశారు మరికొంతమంది. రిలీజైన రెండు రోజులకే చాలా థియేటర్లలో సినిమా లేకుండా పోయింది. కానీ వారం తిరిగేసరికి ప్రతి థియేటర్‌‌లో బిచ్చగాడి హవా మొదలైంది. కళ్లు మూసి తెరిచేలోగా మూవీ హిట్. కేవలం మౌత్‌టాక్‌తోనే అంత గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత తెలుగు పరిశ్రమ దృష్టి ఒక్కసారిగా విజయ్ ఆంటోనీవైపు మళ్లింది. అయితే అతను మనకి కొత్త. సినిమాకి కాదు. సినిమా పరిశ్రమకీ కాదు. తమిళనాట అప్పటికే సినిమాలు చేసివున్నాడు విజయ్ ఆంటోనీ. అవి తెలుగులోకి డబ్ అయ్యాయి కూడా. అయినా అతని టాలెంట్ మనవాళ్లకి తెలిసింది, మెప్పించింది మాత్రం బిచ్చగాడు సినిమాతోనే.

కష్టాలను అధిగమించి..


    
కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌‌ కోయిల్‌లో 1975లో ఇదే రోజున జన్మించాడు విజయ్ ఆంటోనీ. మంచి కుటుంబమే. తాతగారు శామ్యూల్ వేదనాయగం పిళ్లై ప్రముఖ తమిళ కవి. ప్రతాప ముదలియార్ చరిత్రం ఆయన రాసినదే. ఆయనో సివిల్ సర్వెంట్. సమాజ సేవకుడు కూడా. అయితే ఏడేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో ఆంటోనీ జీవితం అల్లకల్లోలమయ్యింది. అమ్మ.. నాలుగేళ్ల చెల్లెలు.. తను.. రెక్కలు తెగిన పక్షుల్లా అయ్యారు. పిల్లల్ని పెంచడానికి, చదివించడానికి తల్లి ఉద్యోగంలో చేరింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇద్దరినీ ప్రయోజకుల్ని చేసింది. లయోలా కాలేజ్‌లో డిగ్రీ చేశాడు ఆంటోనీ. తర్వాత సౌండ్ ఇంజినీరింగ్ చేశాడు. ఆ తర్వాత కొంతమంది సంగీత దర్శకుల దగ్గర సౌండ్ ఇంజినీర్‌‌గా వర్క్ చేశాడు. సంగీతంపైనా పట్టు సాధించాడు. 2005లో శుక్రన్‌ అనే చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసే చాన్స్ సంపాదించాడు. చాలా తమిళ చిత్రాలకు సంగీతం అందించాడు. ‘కథలీల్ విజుంతెన్’ అనే మూవీలోని నాకముక్క అనే పాటకి ఉత్తమ సంగీత దర్శకుడిగా కాన్స్ గోల్డెన్ లయన్‌ను గెల్చుకుని సంచలనం సృష్టించాడు ఆంటోనీ. ఈ పాటను 2011 క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సంలో కూడా ప్రదర్శించారు. తెలుగులోనూ ‘మహాత్మ’ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు విజయ్ ఆంటోనీ. రవితేజ నటించిన ‘దరువు’ మూవీకి అతనే మ్యూజిక్ డైరెక్టర్. ఇక పలు టీవీ సీరియళ్లకి, రియాలిటీ షోస్‌కి కూడా సంగీతం అందించాడు ఆంటోనీ.

అనుకోకుండా ఒక రోజు..


విజయ్ ఆంటోనీ మనసు ఎప్పుడూ మ్యూజిక్ మీదే ఉంది తప్ప యాక్టింగ్ చేయాలని అనుకోలేదు. అయితే అనుకోకుండా స్క్రీన్ మీద కనిపించే చాన్సెస్ వచ్చాయి తనకి. ‘కిళక్కు కాదల్‌కరై సలై’ అనే మూవీ ఓ గెస్ట్ రోల్ చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకి మరో చిత్రంలో ఒక పాటలో మెరిశాడు. తర్వాత మూడేళ్లకు ‘నాన్’ అనే మూవీలో హీరోగా కనిపించి అందరినీ సర్‌‌ప్రైజ్ చేశాడు. ఈ సినిమా తెలుగులో ‘నకిలీ’ పేరుతో వచ్చింది. మొదటి సినిమానే హిట్ కావడంతో ‘సలీమ్’ మూవీ చేశాడు. ఇది తెలుగులో ‘డాక్టర్ సలీమ్‌’గా రిలీజయ్యింది. ఇదీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఒక సినిమా చేశాడు కానీ అంతగా కలిసి రాలేదు. అయితే నాలుగో సినిమా ‘పిచైకారన్’ మాత్రం విజయ్ ఆంటోనీ జీవితాన్ని మలుపు తిప్పింది. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ‘బిచ్చగాడు’గా వచ్చి బంపర్ హిట్ కొట్టాడు ఆంటోనీ. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 

తనదైన దారిలో..

బిచ్చగాడు తర్వాత ఆంటోనీ సినిమాల సంఖ్య పెరిగింది కానీ సరైన సక్సెస్ దక్కడం లేదు. బేతాళుడు, యమన్, కాశి, రోషగాడు లాంటి సినిమాలు అంతగా విజయం సాధించలేదు. అర్జున్‌తో కలిసి చేసిన ‘కిల్లర్‌‌’ సినిమా తప్ప దాదాపు అన్నీ అతనికి నిరాశనే మిగిల్చాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మనసుకు నచ్చిన కాన్సెప్టులు ఎంచుకుంటూ తనదైన దారిలో సాగిపోతున్నాడు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో హీరోగా చేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు.. అతను జయాపజయాల్ని అంతగా పట్టించుకోడదని. తన భార్య ఫాతిమాతో కలిసి సొంత బ్యానర్‌‌లోనే సినిమాలు నిర్మిస్తున్నాడు. తన ప్రతి సినిమాకీ తనే సంగీతం అందించాలనే నియమాన్ని పెట్టుకోలేదు. కొన్నిసార్లు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే ఆంటోనీ కూడా ఇతర హీరోల సినిమాలకి మ్యూజిక్ ఇస్తూ సంగీత దర్శకుడిగానూ తన జర్నీని కొనసాగిస్తున్నాడు. పాటలు రాస్తాడు, పాడతాడు. వంద దేవుళ్లే దిగి వచ్చినా అంటూ బిచ్చగాడులో అతను పాడిన అమ్మ పాట ఇప్పటికీ పలుచోట్ల వినిపిస్తూనే ఉంటుంది. ఎడిటింగ్ చేస్తాడు. ‘బిచ్చగాడు 2’ కోసం మెగాఫోన్ పట్టి డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. 

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్..

ఏం చేసినా చాలా శ్రద్ధగా చేస్తాడని, అలుపూ సొలుపూ లేకుండా కష్టపడతాడని అందరూ ఆంటోనీని మెచ్చుకుంటుంటారు. అలాగే అతని సింప్లిసిటీకి కూడా ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. కూల్‌గా ఉంటాడు. ముఖంలో చిరునవ్వు చెదరనియ్యడు. కాంట్రవర్శీలు ఉండవు. ఎవరితోనూ కలహాలూ రావు. అందుకే ఇండస్ట్రీలో చాలామంది తనని ఇష్టపడతారు. ఈ స్వీట్ పర్సన్, మల్టీ టాలెంటెడ్ మేన్ ఇవాళే పుట్టాడు. ఫ్యూచర్‌‌లో మరింత ఎత్తుకు ఎదగాలని, తన టాలెంట్‌తో ప్రేక్షకుల్ని ఇంకా ఇంకా మెస్మరైజ్ చేయాలని కోరుకుంటూ.. విజయ్ ఆంటోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.