ఏపీలో ఇవాళ ఒక్క రోజే 11వేల కరోనా కేసులు

ఏపీలో ఇవాళ ఒక్క రోజే 11వేల కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కట్టడి చేసేందుకు ఆంక్షలు విధిస్తున్నా కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్న 10 వేల 759 కేసులు నమోదు కాగా ఇవాళ ఒక్క రోజే 11 వేల 766 కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల 581 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 11 వేల 766 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 38 మంది చనిపోయారు. నెల్లూరు జిల్లాలో ఆరుగురు, చిత్తూరు లో ఐదుగురు, తూర్పుగోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, విశాఖ జిల్లాలో ముగ్గురు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మొత్తం 38 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది. మరోవైపు కరోనాతో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఆశాజనకంగానే ఉంది. గడచిన 24 గంటల్లో 4 వేల 441 మంది కరోనా చికిత్సతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. 
10 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు
గత ఏడాది కరోనా ప్రబలడం మొదలైనప్పటి నుండి నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 10 లక్షల మార్కు దాటింది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షల 9 వేల 223 మంది కరోనా వైరస్ బారినపడగా వారిలో 9 లక్షల 27 వేల 418 మంది కోలుకున్నట్లు  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక కోటి 58 లక్షల 80 వేల 750 మంది నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి వస్తే రాష్ట్రంలో 74 వేల 231 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1 వేయి 885 కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 190 కేసులు చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.