
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా గడువున్నా... అన్ని పొలిటికల్ పార్టీల్లో హడావిడి మొదలైంది. బీజేపీ దూకుడుతో అధికార పార్టీ అలర్టైంది. ఇందులో భాగంగానే సాయంత్రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు . క్యాంప్ ఆఫీస్ లో 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. తాజా రాజకీయా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీరు, ఈడీ దాడులు ఉంటాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై సీఎం రియాక్టయ్యే చాన్సుంది. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ , బీజేపీలో చేరికల మీద కూడా సీఎం మాట్లాడతారని గులాబీ వర్గాలు చెప్తున్నాయి. తాజా పరిస్థితుల్లో సీఎం ప్రెస్ మీట్ ఇంట్రస్టింగ్ గా మారింది.
మరో వైపు బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం దాసోజు శ్రావణ్ తో కలిసి బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు . పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తో భేటీ కానున్నారు. సంజయ్ తో పాటు తరుణ్ చుగ్ దగ్గరకు రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వెళ్లనున్నారు. మరోవైపు ఇప్పటికే జేపీ నడ్డాను కలిశారు రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సంజయ్ అమిత్ షాతో పాటు.. నడ్డాను కలవనున్నారు.
ఈ నెల 21న తన పాటు పెద్ద పెద్ద లీడర్లంతా బీజేపీలో జాయిన్ అవుతారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు . టీఆర్ఎస్ ను ఢీకొట్టే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఉపఎన్నికతో మునుగోడులో పనులు జరుగుతున్నాయన్నారు . రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి తాము కష్టపడాలా అంటూ ఫైర్ అయ్యారు. స్వార్ధం కోసమే రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డానన్నారు రాజగోపాల్. రాజకీయంగా ఎదుర్కోలేకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.