ఇయ్యాల భారీ వర్షాలు

ఇయ్యాల భారీ వర్షాలు

తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్

బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు

కుమ్రంభీం జిల్లా ఎల్కపల్లెలో ​13.3 సెం.మీ. వర్షపాతం

23న మరో అల్పపీడనం?

హైదరాబాద్‌, వెలుగు: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇది గురువారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్- అర్బన్, వరంగల్- రూరల్‌, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గురువారం భారీ వర్షా లు కురవచ్చని పేర్కొంది. శుక్రవారం కూడా మోస్తరు వానలు పడవచ్చని చెప్పింది. బుధవారం కుమ్రంభీం, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కుమ్రంభీం జిల్లాలోని ఎల్కపల్లెలో 13.3 సెంటీమీటర్లు, మంచిర్యాలలోని భీమినిలో 12.7, కన్నెపల్లిలో 10, కుమ్రంభీం జిల్లాలోని రెబ్బెనలో 9.6, కాగజ్ నగర్ లో 9.3, ములుగులోని వెంకటాపురంలో 7.9, మంచిర్యాలలోని నీల్వాయిలో 7.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. కాగా, వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.