పరుగుల మోత మోగిన వన్డే సిరీస్‌లో ఫ్యాన్స్‌ను అలరించిన ఇండియా, ఆస్ట్రేలియా ఇప్పుడు టీ20 వార్‌కు రెడీ అయ్యాయి. తొలి రెండు వన్డేల్లో చిత్తయినా.. చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకున్న కోహ్లీసేన షార్ట్ ఫార్మాట్‌లో ఆసీస్‌పై పంజా విసరాలని పట్టుదలగా ఉంది. అదే టైమ్‌లో వచ్చే టీ20 వరల్డ్‌కప్‌కు ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని ఆశిస్తోంది. పలువురు టీ20 స్పెషలిస్టులు అందుబాటులోకి రావడంతో ఇండియా టీమ్ బ్యాలెన్స్ పెరగ్గా.. గాయాల కారణంగా కొందరు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆసీస్ కాస్త డీలా పడింది. వన్డే ఓటమికి కంగారూలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోహ్లీసేనకు ఇదే సరైన సమయం. పైగా ఈ ఫార్మాట్‌లో ఆసీస్‌పై ఇండియాకు మంచి రికార్డుంది. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడే. కాన్‌బెర్రాలోని బ్యాటింగ్ ట్రాక్ సిద్ధంగా ఉంది. మరి ధనాధన్ ఫార్మాట్‌లో దంచికొట్టేది ఎవరో చూడాలి.
కాన్‌బెర్రా: వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం, స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌నకు పటిష్ట జట్టును రెడీ చేసుకోవడం. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా ముందున్న టార్గెట్స్ ఇవి. చివరి వన్డేలో అద్భుతంగా పోరాడి ఈ టూర్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోహ్లీసేన అదే జోరుతో శుక్రవారం జరిగే ఫస్ట్ టీ20లో నెగ్గి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. బ్యాట్స్‌మెన్ ఫుల్ ఫామ్‌లో ఉండగా, బౌలర్లూ గాడిలో పడటంతో టీమ్ కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగింది. పైగా, లాస్ట్ మంత్ వరకూ జరిగిన ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్లేయర్లు ఈ ఫార్మాట్‌లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరి వన్డే మాదిరిగా పక్కా ప్లానింగ్‌తో సమష్టిగా ఆడితే కంగారూలను కచ్చితంగా దెబ్బకొట్టొచ్చు. మరోవైపు వరుసగా రెండో సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకొని టెస్టులకు ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని హోమ్‌టీమ్ భావిస్తోంది. కొందరు కీ ప్లేయర్లు లేకపోయినా సొంతగడ్డపై అనుకూలతలను సద్వినియోగం చేసుకొని ఇండియాపై పైచేయి సాధించాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో ఆసీస్ కొత్త జెర్సీలతో బరిలోకి దిగనుంది.
కాన్ఫిడెన్స్‌లో కోహ్లీసేన
వన్డే సిరీస్‌లో ఇండియా ఓడిపోవడానికి కారణం పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌ను ఎంచుకోలేకపోవడమే. సరైన వనరులు లేకపోవడంతో కోహ్లీసేన ఒకే మ్యాచ్ నెగ్గగలిగింది. ఇప్పుడు ఫార్మాట్ మారింది. కెప్టెన్ కోహ్లీకి ఆప్షన్స్ పెరిగాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, టి. నటరాజన్‌లతో బౌలింగ్ లైనప్‌కు బ్యాలెన్స్ రానుంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున అద్భుతంగా రాణించిన సుందర్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అయితే, కుల్దీప్, చహల్‌ను కాదని కోహ్లీ అతనికి చాన్సిస్తాడా? అన్నది ఆసక్తికరం. ఐపీఎల్‌లో పవర్ ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో సుందర్ సేవలు వాడుకున్న కోహ్లీ ఇక్కడా అదే పని చేస్తే ఫలితం ఆశించొచ్చు. బ్యాట్‌తో హిట్టింగ్ కూడా చేయగలడు కాబట్టి జడేజాకు అతను తోడైతే తుది జట్టు మరింత బలంగా మారనుంది. యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ టీ20 అరగేట్రం చేయడం ఖాయమే. బుమ్రా, దీపక్ చహర్‌తో పాటు అతను పేస్ డిపార్ట్‌మెంట్‌ను నడిపిస్తాడు. నాలుగు ఓవర్ల కోటానే కాబట్టి అవసరం అయితే హార్దిక్ పాండ్యాతో కూడా కోహ్లీ బౌలింగ్ చేయించొచ్చు. ఇక, సూపర్ ఓపెనర్ రోహిత్ శర్మ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ నిండా హార్డ్ హిట్టర్లతో బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. ధవన్, కోహ్లీ, హార్దిక్, లోకేశ్ రాహుల్, జడేజా ఫామ్‌లో ఉన్నారు. వీరికి మనీశ్ పాండే తోడవనున్నాడు. ధవన్‌తో కలిసి లోకేశ్ రాహుల్ ఓపెనర్‌గా దిగితే మనీశ్ ఐదో ప్లేస్‌లో వస్తాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అదరగొట్టిన రాహుల్ తన ఫేవరెట్ ప్లేస్‌లో టీమ్‌కు మంచి ఆరంభం ఇవ్వాలని చూస్తున్నాడు. మిగతా వాళ్లు కూడా తలో చేయి వేస్తే ఇండియాకు ఎదురుండదు. అయితే, వన్డే సిరీస్‌లో ఫెయిలైన శ్రేయస్ అయ్యర్‌ను కొనసాగిస్తారా? లేక సంజు శాంసన్‌కు చాన్స్ ఇస్తారా? అన్నది చూడాలి. మేనేజ్‌మెంట్, కెప్టెన్ తనపై నమ్మకం ఉంచితే అయ్యర్ ఈసారి రాణించి తీరాల్సిందే. లేదంటే జట్టుకు దూరం కావడం ఖాయం.
ఆసీస్‌కు గాయాల దెబ్బ
మూడో వన్డేలో ఓటమితో పాటు పలువురు ప్లేయర్లకు గాయాల కారణంగా ఆస్ట్రేలియా కాస్త డీలా పడినట్టుగా కనిపిస్తోంది. వార్నర్, ప్యాట్ కమిన్స్‌ను సిరీస్ నుంచి తప్పించగా, ఆల్‌రౌండర్లు మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ ఇంకా కోలుకోలేదు. గాయంతో చివరి వన్డేకు దూరంగా ఉన్న మిచెల్ స్టార్క్ ఆడతాడో లేదో తెలియదు. ఇక, టీ20 బౌలింగ్‌లో ఆసీస్ టాప్ ర్యాంక్ బౌలర్ ఆష్టన్ అగర్ కూడా కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో కూడా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఆసీస్ కోరుకుంటోంది. బ్యాటింగ్ భారం మొత్తం భీకర ఫామ్‌లో ఉన్న ఫించ్, స్మిత్, మ్యాక్స్‌వెల్‌పైనే ఉంచింది.వార్నర్ గైర్షాజరీలో ఫించ్‌తో కలిసి మాథ్యూ వేడ్ ఓపెనర్‌గా వచ్చే చాన్సుంది. వన్డే సిరీస్‌లో ధనాధన్ ఆటతో చెలరేగిన మ్యాక్స్‌వెల్ టీ20ల్లో మరింత కీలకం కానున్నాడు. జంపాతో కలిసి స్పిన్ బౌలింగ్‌నూ పంచుకోనున్నాడు. స్టార్క్ ఫిట్‌నెస్ సాధించకుంటే ఆండ్రూ టై బరిలోకి దిగొచ్చు. సీన్ అబాట్, జోష్ హేజిల్‌వుడ్‌తో కలిసి న్యూ బాల్‌ను పంచుకుంటాడు.
జట్లు (అంచనా):
ఇండియా: శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్ (కీపర్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, జడేజా, దీపక్ చహర్, నటరాజన్, బుమ్రా, సుందర్/ చహల్/కుల్దీప్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, క్యారీ (కీపర్), అగర్, అబాట్, ఆండ్రూ టై/స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.
