బోణీ కొట్టేదెవరో : నేడు ఇండియా, శ్రీలంక మధ్య తొలి టీ20

బోణీ కొట్టేదెవరో : నేడు ఇండియా, శ్రీలంక మధ్య తొలి టీ20

నేడు గౌహతిలో ఇండియా‌‌‌‌–శ్రీలంక మధ్య తొలి టీ20.
ఫేవరెట్​గా విరాట్​ సేన. బరిలోకి దిగనున్న బుమ్రా, ధవన్.
సీఏఏ ఆందోళనల నేపథ్యంలో  పటిష్ట భద్రత.

కొత్త ఏడాది.. కొత్త కొత్త ఆలోచనలు.. అంతకుమించిన సరికొత్త ఆశల మధ్య… టీమిండియా 2020లో ఫస్ట్‌‌ మ్యాచ్‌‌కు రెడీ అయ్యింది..! కళ్ల ముందు కదలాడుతున్న టీ20 వరల్డ్‌‌కప్‌‌ను మరోసారి ముద్దాడేందుకు వేట మొదలుపెట్టబోతున్నది..! ఈ మెగా ఈవెంట్‌‌కు ముందు 15 మ్యాచ్‌‌లే ఆడే పరిస్థితులున్న నేపథ్యంలో.. తన డ్రీమ్‌‌ టీమ్‌‌ను ఎంపిక చేసుకునేందుకు కోహ్లీ కూడా కసరత్తులు మొదలుపెట్టబోతున్నాడు..! ఈ నేపథ్యంలో  నేడు శ్రీలంకతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌‌తోనే తన ప్లాన్స్‌‌ పర్‌‌ఫెక్ట్‌‌గా అమలు చేయాలని భావిస్తున్నాడు..! మరి గతేడాది పెర్ఫామెన్స్‌‌ను టీమిండియా కొనసాగిస్తుందా? లంకేయులపై ఆధిపత్యం చూపెడుతుందా? అసలు నయా సాల్‌‌లో బోణీ కొట్టేదెవరు..?

గౌహతిఅద్భుతమైన రికార్డులు.. ఊహలకందని పెర్ఫామెన్స్‌‌తో గతేడాదికి గుడ్‌‌బై చెప్పిన టీమిండియా.. న్యూ ఇయర్‌‌కు అంతే స్థాయిలో స్వాగతం పలకాలని ఆశిస్తోంది. వన్డే ఫార్మాట్‌‌లో ఓ ఊపు ఊపిన విరాట్‌‌సేన..  టీ20 వరల్డ్‌‌కప్‌‌ నేపథ్యంలో ఈ ఏడాది కంప్లీట్‌‌గా పొట్టి ఫార్మాట్​పై దృష్టి సారించింది. మూడు మ్యాచ్​ల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. సిటిజన్‌‌షిప్‌‌ అమెండ్‌‌మెంట్‌‌ యాక్ట్‌‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో వేడెక్కిన గౌహతిలో పరిస్థితి ఇప్పుడిప్పుడే చల్లబడగా..  నేటి మ్యాచ్‌‌  మరోసారి హీట్‌‌ పెంచనుంది. వరల్డ్‌‌కప్‌‌ ప్రారంభానికి ముందు15 టీ20లు ఆడనున్న కోహ్లీ సేన.. ఐపీఎల్‌‌ పూర్తయ్యే లోపే జట్టులోని సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తోంది.

ధవన్‌‌, బుమ్రా రీఎంట్రీ

గాయాల కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు టీమ్‌‌కు దూరమైన పేసర్‌‌ బుమ్రా, ధవన్‌‌ ఈ మ్యాచ్‌‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వర్క్‌‌లోడ్‌‌ కారణంగా వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌కు విశ్రాంతి ఇవ్వడంతో రాహుల్‌‌తో కలిసి ధవన్‌‌ ఇన్నింగ్స్‌‌ ప్రారంభించనున్నాడు. అయితే ఆసీస్‌‌తో సిరీస్‌‌కు రోహిత్‌‌ అందుబాటులో ఉంటాడు. అప్పుడు ముగ్గురు ఓపెనర్లలో ఎవర్ని ఎంచుకుంటారనేది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా ఈ సిరీస్‌‌లో తన సత్తా ఏంటో చూపెట్టాలని ధవన్‌‌ భావిస్తున్నాడు. అదే స్థాయిలో రాహుల్‌‌ కూడా ఫామ్‌‌ కొనసాగించాలని ప్లాన్స్‌‌ వేసుకుంటున్నాడు. మొన్న హైదరాబాద్‌‌లో జరిగిన రంజీ మ్యాచ్‌‌లో సెంచరీ చేయడం ధవన్‌‌కు కలిసొచ్చే అంశం. ఏదేమైనా రాహుల్‌‌ నుంచి ఎదురయ్యే ముప్పును తప్పించుకోవాలంటే ఈ సిరీస్‌‌లో గబ్బర్‌‌ భారీ స్కోర్లు చేయాల్సిందే. కెప్టెన్‌‌ కోహ్లీకి తిరుగులేకపోయినా.. నాలుగో నంబర్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ మరింత రాటుదేలాలి. వీళ్లందర్నీ పక్కనబెడితే.. రిషబ్‌‌ పంత్‌‌ ఎలా ఆడతాడన్న దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే వరుసపెట్టి అవకాశాలు ఇస్తున్నా.. పంత్‌‌ వాటిని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. గత ఆరు మ్యాచ్‌‌ల నుంచి శాంసన్‌‌ కూడా టీమ్‌‌తో పాటు జర్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆడకపోతే ఏ క్షణంలోనైనా పంత్‌‌ ప్లేస్‌‌కు ముప్పు తప్పదు. ఇంత ఒత్తిడిలో సత్తా చాటితేనే వరల్డ్‌‌కప్‌‌ వరకు కొనసాగుతాడు. లేదంటే కష్టమే. విండీస్‌‌తో సిరీస్‌‌లో బ్యాట్‌‌తో చెలరేగిన శివమ్‌‌ దూబే.. బౌలింగ్‌‌లోనూ మెరవాల్సి ఉంది. ఆల్‌‌రౌండర్‌‌గా తన పాత్రను మరింత పటిష్టం చేసుకోవాలి. మనీశ్‌‌ తుది జట్టులోకి వస్తే జడేజా బెంచ్‌‌కు పరిమితం కావొచ్చు. ఇక బౌలింగ్‌‌లో బుమ్రా.. రీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న పేసర్‌‌ రంజీ మ్యాచ్‌‌ ఆడకుండా డైరెక్ట్‌‌గా ఈ సిరీస్‌‌కు వచ్చేశాడు. బుమ్రాతో పాటు నవ్‌‌దీప్‌‌ సైనీ, శార్దూల్‌‌ ఠాకూర్‌‌ పేస్‌‌ బౌలింగ్‌‌ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్‌‌లో కుల్దీప్‌‌, చహల్‌‌, సుందర్‌‌లో ఇద్దరే తుది జట్టులో ఉండనున్నారు.

కుశాల్‌‌పైనే భారం..

బ్యాటింగ్‌‌ వైఫల్యంతో ఆస్ట్రేలియాతో చివరిగా ఆడిన టీ20 సిరీస్‌‌లో 0–3తో చిత్తుగా ఓడిన శ్రీలంక బ్యాట్స్‌‌మన్‌‌కు ఈ  సిరీస్‌‌ సవాలు కానుంది. కుశాల్‌‌ పెరీరాపైనే జట్టు ఎక్కువగా ఆధారపడింది. మూడు ఇన్నింగ్స్‌‌లో కలిపి 100 రన్స్‌‌ చేసిన కుశాల్‌‌ ఆసీస్‌‌ సిరీస్‌‌లో లంక తరఫున టాప్‌‌ స్కోరర్‌‌. ఇక పాకిస్థాన్‌‌పై సిరీస్‌‌లో సత్తా చాటిన రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, గుణతిలక రాణించాలని మేనేజ్‌‌మెంట్‌‌ కోరుకుంటుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన మాజీ కెప్టెన్‌‌ మాథ్యూస్‌‌పై కూడా ఆశలు పెట్టుకుంది. కెప్టెన్‌‌ లసిత్‌‌ మలింగ టీమ్‌‌లో ప్రధాన పేసర్‌‌. ఇతను చెలరేగితే ఇండియాకు కొద్దిగా ఇబ్బంది తప్పదు. లెగ్‌‌ స్పిన్నర్‌‌ హసరంగ కీలకం కానున్నాడు. పాక్‌‌ సిరీస్‌‌లో ఎనిమిది వికెట్లు తీసిన హసరంగ ఆసీస్‌‌లో తేలిపోయాడు. కానీ అతన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.