ఇవాళ 119 బీసీ గురుకులాలు ప్రారంభం

 ఇవాళ 119 బీసీ గురుకులాలు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గురుకులాల ప్రారంభోత్సవానికి అంతా  సిద్దమైంది. 2019-20 విద్యా సంవత్సరానికి సర్కార్ మంజూరు చేసిన 119 బీసీ గురుకులాలను మొదలుపెట్టెందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ గురుకులాలన్నింటినీ ఏకకాలంలో ప్రారంభించాలని నిర్ణయించింది సర్కార్. సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభించనున్నారు.  రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా..గురుకుల పాఠశాలలను పెంచుతూ వచ్చింది.

గత ఐదేళ్లలో 142 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది సర్కార్. కొత్తగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల పాఠశాలల  సంఖ్య 280కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాల, బాలికల బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. 2017–18లో ప్రారంభించిన 119 గురుకులాలను డిమాండ్ ను బట్టి బాల బాలికలుగా విభజించినప్పటికీ…. తాజాగా ప్రారంభిస్తున్న గురుకులాలతో బ్యాలెన్సింగ్  పద్ధతితో బాలబాలికల పాఠశాలలను ఏర్పాటు చేశారు.

మొత్తం 257 బీసీ గురుకులాల్లో 94వేల800 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్  కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యే చాన్స్ ఉంది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ రికార్డును బీసీ గురుకుల సొసైటీ క్రాస్ చేసింది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న విద్యా సంస్థగా బీసీ గురుకుల సొసైటీ రూపుదాల్చనుంది.