ఇవాళ(జులై 28) కేబినెట్ భేటీ..బీసీ రిజర్వేషన్లపై ఫోకస్

ఇవాళ(జులై 28) కేబినెట్ భేటీ..బీసీ రిజర్వేషన్లపై ఫోకస్

 

  • స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను ఆమోదించే చాన్స్​
  • మైనింగ్​ సినరేజ్​, అడ్వకేట్​ ప్రొటెక్షన్​ ముసాయిదాలపై చర్చ​ 
  • బీసీ రిజర్వేషన్లపై డిస్కస్​ చేసే అవకాశం

హైదరాబాద్, వెలుగు:  సెక్రటేరియెట్‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల కుల గణన సర్వేపై ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో సీబీ ఇండెక్స్​ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్​పై  మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆమోదం తీసుకోనున్నారు. ఈ రిపోర్ట్​ ఆధారంగా ప్రభుత్వ పాలసీలు, పథకాల రూపకల్పన చేయనున్నారు.  రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో పంటల పరిస్థితి,  యూరియా నిల్వలపై  చర్చించనున్నారు. ఇటీవల జరిగిన సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై అధికారులు ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌పైనా చర్చిస్తారు. మైనింగ్‌‌‌‌‌‌‌‌ సినరేజ్​ అంశంపై కేబినెట్‌‌‌‌‌‌‌‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతోపాటు అడ్వకేట్​ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ముసాయిదాపై చర్చించి ఆమోదం తీసుకోనున్నట్లు సమాచారం. 

బీసీ రిజర్వేషన్లపై ఫోకస్​

పంచాయతీరాజ్​ చట్ట సవరణ 2018కి సంబంధించి ఆర్డినెన్స్​ ఫైల్​ ప్రస్తుతం గవర్నర్​ దగ్గర పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. దాదాపు 15 రోజులు కావొస్తున్నా.. ఇంకా గవర్నర్​ నుంచి నిర్ణయం వెలువడకపోవడంతో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కోర్టు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించడంతో ఏం చేయాలనే దానిపై కేబినెట్​లో చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అవసరమైతే ఈ విషయంలో గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేకంగా కలిసి.. చట్ట సవరణ ఆర్డినెన్స్​ ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలుస్తున్నది. దీంతోపాటు వివిధ శాఖల్లో  పోస్టుల భర్తీకి  ఆమోదం, గోశాలల నిర్మాణం, గోవుల సంరక్షణ కోసం సమగ్రమైన విధానం, సాగునీటి ప్రాజెక్టులు, కొత్త రేషన్​ కార్డుల పంపిణీ కార్యక్రమంపై కేబినెట్​భేటీలో చర్చించనున్నారు.