ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు..370 సీట్లివ్వండి: మోదీ

ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు..370 సీట్లివ్వండి: మోదీ

    స్విట్జర్లాండ్​ను తలదన్నేలా కాశ్మీర్​ను అభివృద్ధి చేస్తం: పీఎం 

    జమ్మూకాశ్మీర్​లో రూ. 32 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం

జమ్మూ: 
జమ్మూకాశ్మీర్​కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లే అక్కడ అభివృద్ధి ఊపందుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న జమ్మూకాశ్మీర్ వైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఆర్టికల్ 370 అతిపెద్ద అడ్డంకిగా ఉండేది. రాజ్యాంగపరమైన నిబంధనల కారణంగా ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి నోచుకోలేకపోయింది. అందుకే ఈ అడ్డంకిని బీజేపీ ప్రభుత్వం తొలగించింది” అని మోదీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని 370 సీట్లలో గెలిపించాలని దేశ ప్రజలను ఆయన కోరారు. జమ్మూకాశ్మీర్ లో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన సభలో ఆయన స్థానిక డోగ్రి భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం హిందీలో ప్రసంగం కొనసాగించారు. ఇకపై జమ్మూకాశ్మీర్ ను చూస్తే స్విట్జర్లాండ్ వంటి దేశాలను మరిచిపోయేలా అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. ‘నిరుడు ఇక్కడ జీ20 ఈవెంట్ సందర్భంగా కాశ్మీర్ అందాలు, సంప్రదాయాలు, సంస్కృతి హైలైట్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించాలని అనిపించేలా ఆ ఈవెంట్ ఉపయోగపడింది’ అని మోదీ చెప్పారు. ఈ ఏడాది కాశ్మీర్​కు రికార్డ్ స్థాయిలో 2 కోట్ల మంది టూరిస్టులు వచ్చారని, మాతా వైష్ణో దేవి ఆలయానికి ఈ దశాబ్దంలోనే అత్యధికంగా సందర్శకులు వచ్చారన్నారు. యామి గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్టికల్ 370’ సినిమానూ ప్రధాని తన స్పీచ్​లో ప్రస్తావించారు. 

వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి 

జమ్మూకాశ్మీర్​కు వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి కల్పించామని, తమ ప్రభుత్వం నేరుగా ప్రజల చెంతకే వెళుతోందని మోదీ అన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలను ఉద్దేశిస్తూ.. గతంలో కుటుంబ, వారసత్వ రాజకీయాలు, పాలనకు జమ్మూకాశ్మీర్ బాధిత ప్రాంతంగా ఉండేదన్నారు. 

'లాఖ్ పతి దీదీస్’కు మద్దతివ్వాలె 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన 1,500 మంది ఉద్యోగులకు ప్రధాని ఈ సందర్భంగా అపాయింట్​మెంట్ లెటర్లు అందజేశారు. ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ’ కార్యక్రమంలో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేసేందుకు చేపట్టిన ‘లాఖ్ పతి దీదీస్’ కార్యక్రమానికి మహిళలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. 

రూ. 45,500 కోట్ల ప్రాజెక్టులు.. 

ప్రధాని మోదీ మంగళవారం జమ్మూకాశ్మీర్ లో రూ. 32 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. జమ్మూ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో రూ. 13,500 కోట్ల ప్రాజెక్టులకూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

దేశంలోనే అతిపెద్ద రైల్వే టన్నెల్ ప్రారంభం 

బనిహాల్–ఖడీ–సంబర్–సంగల్ దాన్ మార్గంలో 48 కిలోమీటర్ల రైల్వే లైనును ప్రారంభించారు. ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీఆర్ఎల్)లో భాగంగా ఉన్న ఈ మార్గంలోనే ఖడీ, సంబర్ ప్రాంతాల మధ్య 12.77 కిలోమీటర్ల పొడవైన దేశంలోనే అతిపెద్ద రైల్వే ట్రాన్స్ పోర్టేషన్ టన్నెల్ (టీ–50)ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ మార్గంలో మొత్తం 11 టన్నెల్స్ ఉండగా, వీటిలో టీ–50 టన్నెల్ ప్రాజెక్ట్ చాలా సవాలుగా నిలిచింది. ఇది పూర్తయ్యేందుకు దాదాపు 14 ఏండ్లు పట్టింది. అలాగే బారాముల్లా–శ్రీనగర్–బనిహాల్–సంగల్ దాన్ సెక్షన్​లో 185 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రైల్వే లైన్​ను,  కాశ్మీర్ లోయలో తొలి ఎలక్ట్రిక్ ట్రెయిన్​ను సంగల్ దాన్–బారాముల్లా మధ్య ప్రారంభించారు.