
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇందులో రైతు రుణమాఫీకి ఆమోదముద్ర వేయనున్నట్టు తెలిసింది. 22 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ భవనాలకు భూ కేటాయింపు, కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణం, కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. మొత్తం కేబినెట్ ఎజెండాలో 35 అంశాలు ఉన్నాయి. నాలుగు నెలల విరామం తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశం కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 21న సమావేశమైన కేబినెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. తర్వాత వరుస ఎన్నికల కోడ్‌తో మళ్లీ సమావేశం కాలేదు. ఈ భేటీలో కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవన నిర్మాణాలకు నిధులు కేటాయించే చాన్స్ ఉంది. ఆ రెండు భవనాల భూమి పూజ తేదీలను సీఎం ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదిస్తారని ప్రచారం జరిగినా రెవెన్యూ శాఖలో సంస్కరణలపైన చర్చకు అవకాశమున్నట్టు తెలిసింది. కొత్త మున్సిపల్ యాక్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపి.. ఆర్డినెన్స్ తీసుకువచ్చే చాన్స్ కనిపిస్తోంది. రైతు రుణమాఫీకి ఓట్ ఆన్ ఎకౌంట్‌లో రూ. 6 వేల కోట్లు ప్రకటించారు. 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు. రైతు రుణమాఫీని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు.
ఎన్.శంకర్‌కు 15 ఎకరాలు
ఇండస్ట్రియల్ కారిడార్‌కు మిషన్ భగీరథ నీటి కేటాయింపులు, ఉద్యోగులకు ఐఆర్ వంటి అంశాలపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. సినీ దర్శక నిర్మాత ఎన్.శంకర్‌కు హాలీవుడ్ స్థాయిలో స్టూడియో నిర్మాణానికి శంకర్‌పల్లిలో 15 ఎకరాలు, శారదాపీఠానికి హైదరాబాద్‌లో 2 ఎకరాలు ఇవ్వడం అజెండాలో ఉన్నాయి. నిరుద్యోగ భృతికి అర్హుల ఎంపికకు కూడా కమిటీ వేసే అవకాశముందని చెబుతున్నారు.