
- ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు!
- ఇయ్యాల 31వ స్వాతంత్ర్య దినోత్సవం
- ఇండిపెండెన్స్ డే లక్ష్యంగా ఎటాక్సభలు, సమావేశాలు రద్దు
- అలర్ట్‌గా ఉండాలన్న జెలెన్ స్కీ
- యుద్ధం మొదలై 6 నెలలు పూర్తి
కీవ్: రష్యా ఆధిపత్య సోవియట్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన ఉక్రెయిన్.. బుధవారం 31వ ఇండిపెండెన్స్ డేను జరుపుకుంటున్నది. అదేవిధంగా రష్యాతో యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తమ పౌరులను హెచ్చరించారు. రెండు, మూడు రోజుల్లో రష్యా భీకర దాడులకు దిగే చాన్స్ ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సైనిక విన్యాసాలు, ఇతరత్రా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఎవరూ వీధుల్లో గుమిగూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు. సివిలియన్స్‌ను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుందని, ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని చెప్పారు.
డార్యా డుగిన్ హత్యతో సంబంధం లేదురష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు అలెగ్జాండర్ డుగిన్ కూతురు డార్యా డుగినా హత్యపై కూడా ఉక్రెయిన్ స్పందించింది. ఆ హత్యతో తమకు సంబంధంలేదని ఉక్రెయిన్ నేషనల్ సెక్యురిటీ అండ్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సీ డెనిలోవ్ స్పష్టం చేశారు.
జపోరిజియా లక్ష్యంగా దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా మిసైల్స్ దాడులు చేస్తూనే ఉంది. దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నది. సోమవారం రాత్రి కూడా జపోరిజియాకు పశ్చిమాన ఉన్న నగరాలపై రాకెట్లతో విరుచుకుపడింది. యూరప్‌లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజియాలో ఉంది. ఈ ప్రాంతంపై రష్యా షెల్లింగ్‌కు పాల్పడుతూనే ఉంది. దీంతో న్యూక్లియర్ ప్లాంట్‌కు ప్రమాదం పొంచి ఉంది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా జపోరిజియాపై షెల్లింగ్ ఎటాక్ చేసినట్టు రీజినల్ గవర్నర్ రెంజిన్చ్కో తెలిపారు.
నా కల చెదిరిపోయింది : డానిక్
యుద్ధం ప్రారంభం కాకముందు ఉన్న పరిస్థితిని చెర్నిహివ్‌లో నివాసం ఉంటున్న 12 ఏండ్ల డానిక్ రాక్ గుర్తుచేశాడు. ‘‘రష్యా దాడికి ముందు రోజూ నేను సాకర్ ఆడుతూ ఫ్యామిలీతో కలిసి ఆనందంగా ఉండేవాడ్ని. ఇప్పుడంతా మారిపోయింది. బాంబు దాడిలో ఇళ్లు కూలిపోయింది. అమ్మ తీవ్రంగా గాయపడింది. పాలు అమ్ముకుంటూ అమ్మ చికిత్స కోసం డబ్బులు జమచేస్తున్నా..” అంటూ డానిక్ ఏడుస్తూ చెప్పాడు.
అమెరికా ఎంబసీ సెక్యురిటీ అలర్ట్
కీవ్‌లోని అమెరికా ఎంబసీ కూడా సెక్యురిటీ అలర్ట్ జారీ చేసింది. ఉక్రెయిన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ర్టక్చర్తో పాటు గవర్నమెంట్ భవనాలపై రష్యా మిసైల్స్, రాకెట్లతో దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చిందని యూఎస్ ఎంబసీ తెలిపింది. అమెరికా పౌరులు వెంటనే ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోవాలని సూచించింది. గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆప్షన్ బెటర్ అని తెలిపింది. ఇండిపెండెన్స్‌డే వేడుకలకు దూరంగా ఉండాలని కోరింది.