నిర్భయ నిందితుల ఉరిపై ఇవాళ తీర్పు

నిర్భయ నిందితుల ఉరిపై ఇవాళ తీర్పు

నిర్భయ కేసులో ఇవాళ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేసులో నలుగురు దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశాఖ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. నిర్భయ దోషులతో పాటు తీహార్ జైలు అధికారులు నోటీసులు ఇచ్చింది. ఐతే ఇవాళ ఆదివారం సెలవు ఐనప్పటికీ కేసు విచారణ జరగనుంది.

దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు స్టే విధించడంపై అసహనం వ్యక్తం చేసింది కేంద్ర హోంశాఖ. దోషులకు న్యాయపరమైన అంశాలను వినియోగించుకునేందుకు ఇప్పటికే టైం ఇచ్చారని పిటిషన్ లో తెలిపింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఉరిని ఆలస్యం చేయడానికి దోషులు ఒకరి వెనుక మరొకరు ప్రయత్నాలు చేస్తున్నారని, న్యాయ ప్రక్రియను దోషులు ఒక ఆట లాగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దోషులకు శిక్ష పడటం ఆలస్యం కావచ్చు గానీ.. ఉరిశిక్ష పడటం మాత్రం ఖాయమన్నారు నిర్భయ తల్లి. దోషుల తరుపు న్యాయవాది కోర్టులో వాదిస్తున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. ఫిబ్రవరి 1నే  నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉండగా…. అంతకు రెండు రోజుల ముందు తమకు విధించిన ఉరి శిక్షపై స్టే విధించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు దోషులు. దీంతో ఉరి అమలు మరోసారి వాయిదా పడింది. తర్వాతి ఆదేశాలు వచ్చే వరకు ఉరి అమలు నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది.