నేషనల్ స్పోర్ట్స్ డే రోజు సరికొత్త చరిత్ర: పారాలింపిక్స్‌లో మూడో మెడల్

నేషనల్ స్పోర్ట్స్ డే రోజు సరికొత్త చరిత్ర: పారాలింపిక్స్‌లో మూడో మెడల్

నేషనల్ స్పోర్ట్స్‌ డే రోజున పారాలింపిక్స్‌లో మన అథ్లెట్స్‌ దంచికొడుతున్నారు. వరుసగా ఆదివారం ఒక్కరోజే మూడు మెడల్స్ సాధించారు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు టేబుల్‌ టెన్నిస్‌లో భవీనా పటేల్, హై జంప్‌లో నిషాద్‌ కుమార్‌‌లు సిల్వర్‌‌ మెడల్స్ సాధించారు. తాజాగా 41 ఏండ్ల వినోద్‌ కుమార్  డిస్కస్‌ థ్రోలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని భారత్‌ ఖాతాలో మూడో మెడల్‌ను తెచ్చిపెట్టారు. ఇలా ఒక్కరోజే పారాలింపిక్స్‌లో మూడు మెడల్స్ రావడంతో ఈ నేషనల్ స్పోర్ట్స్‌ డే చరిత్రలో నిలిచిపోయే రోజుగా మారిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. మెడల్స్ సాధించిన అథ్లెట్స్‌ను ఆయన అభినందించారు.

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా ట్రైనింగ్‌లో ప్రమాదం.. పదేళ్లకు పైగా మంచంలోనే

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో ఐదో రోజైన ఆదివారం జరిగిన మెన్స్ డిస్కస్‌ థ్రోలో పోలాండ్ అథ్లెట్ పియోట్ర్‌‌ కోసెవిక్స్‌ 20.02 మీటర్ల దూరానికి డిస్క్‌ను విసిరి గోల్డ్ మెడల్ సాధించగా, క్రొయాషియా అథ్లెట్ 19.98 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలచుకున్నాడు. భారత అథ్లెట్ వినోద్‌ కుమార్  19.91 మీటర్ల దూరానికి డిస్క్‌ను విసిరి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. వినోద్‌ కుమార్‌‌ది భారత సైన్యంలో సేవలందించిన కుటుంబం. 1971 ఇండో–పాక్‌ వార్‌‌లో వినోద్‌ కుమార్‌‌ తండ్రి ఇండియన్ ఆర్మీ వీర సైనికుడిగా పోరాడారు. వినోద్ కూడా బీఎస్‌ఎఫ్‌లో సైనికుడిగా చేరారు. అయితే లఢఖ్‌లోని లేహ్‌లో శిక్షణ పొందుతుండగా ప్రమాదవశాత్తు కొండ అంచు నుంచి కిందపడిపోవడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. వెన్నెముకకు దెబ్బ తగలడంతో శరీర భాగాల్లో చలనం లేకుండా దాదాపు పదేండ్లకు పైగా పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అంతటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా మళ్లీ జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో ఆ వైకల్యాన్ని జయించి డిస్కస్‌ థ్రోపై పట్టు సాధించారు వినోద్‌ కుమార్. టోక్యో పారాలింపిక్స్‌లో తన సత్తా చాటి దేశం గర్వించేలా చేశారు.