కూసుమంచి, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌తో కలిసి శుక్రవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రెండున్నరేండ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. 25 లక్షల మంది రైతులకు రూ.20,670 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు ఇచ్చామని, సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. భూభారతి తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు అందజేశామని చెప్పారు.
ఈ సందర్భంగా వెంకట్రాంపురంలో దేపంగి శ్రీకాంత్, వీరకుమారి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం చేగొమ్మ గ్రామంలో పీఏసీఎస్ గోడౌన్లను ప్రారంభించారు. నేలకొండపల్లి మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద 27 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 132 మంది సీఎంఆర్ఎఫ్లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. అనంతనగర్ గురుకుల పాఠశాలలో మరమ్మతుల కోసం రూ.34 లక్షలతో శంకుస్థాపన చేశారు. అనంతరం వంటశాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం, వసతులపై ఆరా తీశారు.
