- నాన్ లోకల్ వెహికల్స్ కు రూ.600.. ఒకేసారి నాలుగింతలు పెరిగిన ట్యాక్స్
- లోకల్ వెహికల్స్కు మినహాయింపు ఇవ్వాలని స్థానికుల డిమాండ్
మంచిర్యాల/జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్‌లో పర్యావరణ పరిరక్షణ పేరుతో అటవీశాఖ వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ ను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఫారెస్ట్ చెక్‌పోస్టుల వద్ద భారీ వాహనాలకు రూ.150, కార్లు, జీపులకు రూ.50 వసూలు చేసేవారు. ఇప్పుడు నాన్-లోకల్ వాహనాలకు రూ.600, లోకల్ వాహనాలకు రూ.300 వసూలు చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ నెల 12న జరిగిన వన్యప్రాణి బోర్డు సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గతంలో టైగర్ జోన్‌లో భారీ వాహనాల రాకపోకలను నిషేధించడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించడంతో ప్రభుత్వం చివరకు అనుమతులు ఇచ్చింది. అయితే ఆరు నెలలు కూడా గడవకముందే టోల్ ట్యాక్స్ పేరుతో అదనపు భారం మోపడం అన్యాయమని స్థానికులు విమర్శిస్తున్నారు. లోకల్ వాహనాలకు టోల్ ట్యాక్స్ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పునరాలోచించకుంటే ఉద్యమిస్తాం
ఇప్పటికే టైగర్ జోన్ పేరుతో ఆఫీసర్లు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. స్థానికంగా ఉన్న వనరులను సైతం ఇక్కడి ప్రజలకు దక్కకుండా ఆంక్షలను విధిస్తున్నారు. ఇప్పుడు వాహనాలపై టోల్ ట్యాక్స్ పేరుతో భారీ వాహనాలకు రూ.600, ఇతర చిన్న వాహనాలకు రూ.300 వసూలు చేయడం దారుణం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. లేకపోతే మరో ఉద్యమం చేపడుతాం.
శ్రీరాముల భూమాచారి, సామాజిక కార్యకర్త
ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు
టోల్ ట్యాక్స్ పెంపు వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. రూ.150 ఉన్న టోల్ ఫీజు ఏకంగా నాలుగింతలు పెంచడం సరికాదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
మూల భాస్కర్ గౌడ్, జన్నారం
