టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్ లో నెలకొన్న వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత వర్గానికి ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (AIFEC) షాక్ ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన, వ్యక్తిగత స్వార్థంతో కూడిన నిర్ణయాలు, ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన తీవ్ర ఫిర్యాదుల నేపథ్యంతో జానీ మాస్టర్‌పై 'సహాయ నిరాకరణ' (Non-Cooperation) ప్రకటించింది ఫెడరేషన్.
చిన్న చిన్న కారణాలకే షూటింగ్‌లను అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయడం, హైదరాబాద్ స్థానిక కళాకారులను పక్కనపెట్టి ఇతర ప్రాంతాల డ్యాన్సర్లను ప్రోత్సహించడం, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలపై ఫెడరేషన్‌కు భారీగా ఫిర్యాదులు అందాయి. సాధారణ డ్యాన్సర్ల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు, యూనియన్ సభ్యులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ స్పష్టం చేసింది.
అనుబంధ సంఘాలన్నీ ఈ సహాయ నిరాకరణ నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ వివాదాల నేపథ్యంలో అక్టోబర్ 11న జరగాల్సిన డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలను అక్టోబర్ 18కి వాయిదా వేస్తూ, ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది.
మరోవైపు, ఫెడరేషన్ నిర్ణయంపై జానీ మాస్టర్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు లేకుండా ఏకపక్షంగా సహాయ నిరాకరణ నిర్ణయం తీసుకోవడం చెల్లదు సుమలత ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం ఏం తప్పు చేశామని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అని ఫైర్ అయ్యారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు
ఛాంబర్ లో ఈసీ మీటింగ్ జరుగుతుండగా సమలత వర్గం దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో జేఏసీ , ఈసీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలక్షన్స్ పెడుతున్నట్లు కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. అసలు ఏ తప్పు చేశామని మమ్మల్ని తప్పించాలని చూస్తున్నారని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ ఉన్నంత కాలం ఇలాగే గొడవలు జరుగుతుంటాయని ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ లో పెడరేషన్ జోక్యం ఎందుకు అని ప్రశ్నించారు.
ALSO READ ; రీతూ చౌదరికి డిమాన్ పవన్ బ్రేకప్...
ఒకవైపు ఫెడరేషన్ కఠిన వైఖరి, మరోవైపు జానీ మాస్టర్ టీమ్ హెచ్చరికలతో టాలీవుడ్ డ్యాన్స్ యూనియన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాయిదా పడిన అక్టోబర్ 18 నాటి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేక ఈ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
