బీర్ తాగానని సెలక్ట్ కాలె.. అదే కలిసొచ్చిందట..!

బీర్ తాగానని సెలక్ట్ కాలె.. అదే కలిసొచ్చిందట..!

హాలీవుడ్ సినిమాలు చూసేవారికి టామ్ క్రూజ్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి అతడో సూపర్‌‌ హీరో. ఎంతోమంది అమ్మాయిలకి తనో డ్రీమ్ లవర్. యాక్షన్ సీన్స్‌ని తన ఎనర్జీతో పీక్స్‌కి తీసుకెళ్తాడు. సినిమా కోసం ఎంత రిస్క్ తీసుకోడానికైనా రెడీ అయ్యి వారేవా అనిపిస్తాడు. అందుకే వరల్డ్ ఫేమస్ స్టార్ అయ్యాడు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా టామ్ క్రూజ్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు.

1962లో పుట్టాడు టామ్. తండ్రి ఉద్యోగరీత్యా ఫ్యామిలీ అటూ ఇటూ తిరుగుతూనే ఉండేది. దాంతో పద్నాలుగేళ్లలో పదిహేను స్కూళ్లు మారాడు. నాలుగో ఏటనే స్కూల్లో వేసిన ఒక డ్రామాలో నటించాడు. అయితే యాక్టర్ కావాలనే ఆలోచన తనకి ఎప్పుడూ లేదు. డబ్బు లేని కారణంగా క్యాథలిక్ చర్చ్ స్కాలర్‌‌షిప్‌తో చదువుకునేవాడు. ఆ ప్రభావంతో ఒక సమయంలో ప్రీస్ట్ అవ్వాలనుకున్నాడు. ఫుట్‌బాల్‌ బాగా ఆడేవాడు. టీమ్‌కి కూడా సెలెక్టయ్యాడు. కానీ గేమ్‌కి ముందు బీర్ తాగడంతో తనని స్క్వాడ్‌ నుంచి తీసేశారు. దాంతో సీన్ రివర్స్ అయ్యింది. తన స్కూల్‌ వాళ్లు తీసిన ‘గయ్స్ అండ్ డాల్స్‌’లో నటించిన తర్వాత యాక్టింగ్‌ని ఎందుకు కెరీర్‌‌గా తీసుకోకూడదు అనిపించింది. పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి తనకి అదే కరెక్టని డిసైడయ్యాడు. మొదట్లో టెలివిజన్‌లో వర్క్ చేయడానికి ట్రై చేశాడు టామ్. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతలో అనుకోకుండా సినిమాల్లో చాన్స్ వచ్చింది. 1981లో ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సంవత్సరమే మరో సినిమాలోనూ నటించాడు. హ్యాండ్‌సమ్‌గా ఉండటంతో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండటంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ద ఔట్‌సైడర్స్, లెజెండ్, టాప్ గన్, రెయిన్ మేన్, ఇంటర్వ్యూ విత్‌ ద వ్యాంపైర్, కొల్లేటరల్, ఎడ్జ్ ఆఫ్ టుమారో లాంటి స్టార్ అయిపోయాడు. ‘మిషన్ ఇంపాజిబుల్‌’ ఫ్రాంచైజీ అయితే అతణ్ని మిగతా హీరోలు అందుకోలేనంత ఎత్తులో నిలబెట్టింది.

ఫిట్‌నెస్‌కి, విల్‌ పవర్‌‌కి టామ్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. షూటింగ్ సమయంలో అతను చేసే సాహసాలు మామూలుగా ఉండవు మరి. ఎత్తైన ప్రదేశాల నుంచి దూకుతాడు. బైక్‌ని జెట్‌ స్పీడులో నడుపుతాడు. ఇక నీటి అడుగుకు వెళ్లి ఊపిరి బిగబడతాడు. ‘రోగ్ నేషన్’ మూవీ కోసం ఆరు నిమిషాల పాటు నీటి అడుగున ఊపిరి బిగబట్టి ఉన్నాడు. ‘ద లాస్ట్ సమురాయ్’ షూటింగ్‌లో టామ్‌కి పెద్ద ప్రమాదం తప్పింది. టామ్, విలన్ హిరోయుకి కత్తి యుద్ధం చేసే సన్నివేశమది. హీరోయిన్ కి తన కత్తిని రాంగ్ టైమ్‌లో ఝుళిపించడంతో పట్టు తప్పి టామ్ వైపు దూసుకొచ్చింది. అతను అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి తప్పించుకున్నాడు. లేదంటే ఆరోజు అతని ప్రాణం పోయి ఉండేదని ఇప్పటికీ ఆ సినిమాకి పని చేసినవాళ్లు చెబుతుంటారు. ‘ద ఔట్‌సైడర్స్’ షూటింగ్‌లోనూ టామ్ గాయపడ్డాడు. 1986లో ‘టాప్‌గన్’  మూవీ రిలీజయ్యే నాటికి టామ్ వయసు 24. దానికి సీక్వెల్ వచ్చేటప్పటికి అతని వయసు 59. కానీ అప్పుడెంత జోష్ చూపించాడో ఇప్పుడూ అంతే చూపించాడు. రిస్కీ షాట్స్ని సైతం ఓ యంగ్ హీరో మాదిరిగా చేసి అదరగొట్టాడు. అందుకే ఇప్పటికీ తన పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. హాలీవుడ్‌ సినిమాలు చూసే ప్రతి పదిమందిలో తొమ్మిది మంది అతని ఫ్యాన్సేనని ఓ సర్వే తేల్చింది. టామ్‌ నిర్మాతగానూ మారాడు. కొన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. కొన్నింటిని కో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.  

ఎనభయ్యో దశాబ్దం ప్రారంభంలో సన్‌గ్లాసెస్ తయారు చేసే రేబాన్ కంపెనీ కష్టాల్లో పడింది. సరైన అమ్మకాలు లేక నష్టాలు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో టామ్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. రిస్కీ బిజినెస్, టాప్ గన్ లాంటి సినిమాల్లో టామ్ ఆ కంపెనీ గ్లాగుల్స్నే వాడాడట. దాంతో వాటికి క్రేజ్ పెరిగి అందరూ కొనడం మొదలుపెట్టారు. ఫలితంగా ఆ కంపెనీ సేల్స్ నలభై శాతం పెరిగాయట. టామ్ తండ్రి చాలా కఠినాత్ముడు. రూల్స్ పేరుతో టామ్‌ని, అతని ముగ్గురు సిస్టర్స్ ని చితక బాదేవాడు. భార్యనీ బాధపెట్టేవాడు. చాన్నాళ్లు మౌనంగా భరించిన టామ్ తల్లి ఓ సమయం వచ్చేసరికి ఇక తట్టుకోలేకపోయింది. నలుగురు పిల్లల్నీ తీసుకుని భర్తకి దూరంగా వెళ్లిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటికి టామ్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు. తర్వాత కొన్నాళ్లకు అతని తండ్రి క్యాన్సర్‌‌తో చనిపోయాడు. తండ్రి పెట్టిన బాధల గురించి స్టార్ అయ్యాక కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు టామ్. అతని వల్ల తనకి మంచి బాల్యం దక్కలేదని ఫీలవుతుంటాడు. టామ్ చాన్నాళ్లు డిస్‌లెక్సియా అనే సమస్యతో బాధపడ్డాడు. దానివల్ల ఏదీ త్వరగా నేర్చుకోలేకపోయేవాడు. స్కూల్లో తోటి పిల్లలు ఎక్కడ తన లోపాన్ని కనిపెట్టేస్తారోనని భయపడుతూ ఉండేవాడు. పెద్దయ్యేవరకు కూడా తనని రీడింగ్ ప్రాబ్లెమ్ ఇబ్బంది పెడుతూనే ఉందని తనే ఒకసారి రివీల్ చేశాడు. 

టామ్‌ రియల్‌ లైఫ్‌లో కూడా హీరోలానే బిహేవ్ చేస్తాడు. ఓసారి అతని పక్కింట్లోంచి మహిళ అరుపులు వినిపించాయట. వెళ్లి చూస్తే ఓ దొంగ ఆవిడ నగలన్నింటినీ ఎత్తుకుని పారిపోతున్నాడు. అది గమనించిన టామ్ సినిమాల్లో హీరోలాగే చేజ్‌ చేసి మరీ దొంగని పోలీసులకు పట్టించాడట. అలాగే ఓ అప్‌కమింగ్ నటికి కార్ యాక్సిడెంట్ అయ్యింది. తీవ్ర గాయాలవడంతో ట్రీట్‌మెంట్‌కి చాలా ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఆమెకి ఇన్సూరెన్స్ లేదని తెలియడంతో ఆ బిల్‌ మొత్తం టామ్ కట్టేశాడట. ఇంకా చాలా రకాల సేవా కార్యక్రమాలకి తన వంతు చేయూతనిస్తుంటాడు. రజినీకాంత్‌కి జపాన్‌లో ఉన్న ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. నిజానికి టామ్ క్రూజ్‌కి అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జపాన్‌లో. అక్కడ ఏటా అక్టోబర్‌‌ 10ని ‘టామ్ క్రూజ్‌ డే’గా జరుపుకుంటారు. 2006 నుంచి ఇది జరుగుతోంది. జపాన్‌ని ఎక్కువసార్లు సందర్శించిన హీరో టామేనట. అందుకే వాళ్లకి అతనంటే అంత అభిమానం. ప్రపంచంలోని హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో టామ్ ఒకడు. మన కరెన్సీలో చూసుకుంటే సంవత్సరానికి అతని సంపాదన నూట మూడు కోట్లు. కాలిఫోర్నియాలో అతని ఇల్లు పదివేల రెండు వందల ఎనభయ్యారు చదరపు అడుగుల్లో ఉంటుంది. దాని విలువ ఎంతుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని దగ్గర ఉన్న కార్లు, ప్రైవేట్ జెట్లు అన్నీ కలిపితే కొన్ని వందల కోట్లు. 1994లో పైలట్ లైసెన్స్ తీసుకున్నాడు టామ్.

టామ్ క్రూజ్ లాంటి హీరోలకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అతని లైఫ్‌లో చాలామంది అమ్మాయిలు ఉన్నారని హాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. టామ్ మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మొదట నటి మిమీ రోజర్స్ ని చేసుకున్నాడు. కొద్ది కాలానికే వాళ్లు విడిపోయారు. ఆ తర్వాత ఫేమస్ హీరోయిన్ నికోల్‌ కిడ్‌మన్‌తో వివాహం. ఇద్దరూ ఒక బాబుని, పాపని అడాప్ట్ చేసుకున్నారు. పదకొండేళ్లు అన్యోన్యంగా జీవించాక విడిపోయారు. తర్వాత హీరోయిన్ క్యాటీ హోమ్స్ తో డేట్ చేశాడు టామ్. ఓ కూతురు పుట్టిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగతంగా జీవితంలో కొన్ని వివాదాలున్నా.. వృత్తిపరంగా మాత్రం టాప్‌లో ఉన్నాడు టామ్ క్రూజ్. ఇంకొన్నాళ్ల పాటు అతని స్టార్‌‌డమ్‌కి తిరుగు లేదనేది హాలీవుడ్‌ అనలిస్టుల అంచనా. అదే నిజమవ్వాలని కోరుకుంటూ.. టామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
 

టామ్ క్రూజ్‌ గురించి మరిన్ని డీటైల్స్ కోసం..