కిలో టమాటా 300 రూపాయలు.. త్వరలోనే మీ కోసం

కిలో టమాటా 300 రూపాయలు.. త్వరలోనే మీ కోసం

టమాటా ధరల గురించి మాట్లాడుతున్నంత సేపు మన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందనడంలో సందేహమే లేదు. ధర రాక రైతులు రోడ్లపై పారేసిన రోజుల నుంచి ప్రస్తుతం సరాసరిన ఒక్కో టమాటాను రూ.10 నుంచి రూ.20(సైజును బట్టి) పెట్టి కొనాల్సిన దుస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ప్రస్తుతం రూ.200లకు పైగే ఉండటం ఒక పక్క ఆందోళనకు గురి చేస్తుండగా.. హోల్ సేల్ మార్కెట్లో వ్యాపారులు చెప్తున్న ఇంకో థియరీతో సామాన్యుడు ఊపిరి బిగబట్టాల్సి వస్తుందేమో. 

నిజమేనండీ.. రానున్న రోజుల్లో కిలో టమాటా ధర రూ.300 కు చేరుకుంటుందని వ్యాపారులు చెప్పడం కలవరపాటుకు గురి చేస్తోంది.   ఓ వస్తువు నిత్యావసరంగా మారడం.. ప్రతికూల పరిస్థితుల వల్ల దానిని వదిలేయడం ఇప్పుడు ఓ సవాలుగా మారింది. ధరల విషయానికి వస్తే రానున్న రోజుల్లో టమాటా ధరలు కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయని దేశంలోని హోల్ సేల్ వ్యాపారులు చెబుతుండటం కలవర పాటుకు గురి చేస్తోంది.

టమాటా, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా పడిపోవడంతో హోల్‌సేల్ వ్యాపారులు నష్టపోతున్నారని వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు కౌశిక్ తెలిపారు. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.160 ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం రూ.220కి చేరాయని, దీంతో రిటైల్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.  

కీలకమైన ఉత్పత్తి ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయాల కారణంగా ఇప్పుడు నెలకు పైగా టమోటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి."హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షం కారణంగా కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి.  ప్రస్తుతం కూరగాయల ఎగుమతిలో సాధారణం కంటే 6 నుంచి 8 గంటలు ఎక్కువ సమయం పడుతోంది.  దీని కారణంగా కిలో టమాటాల ధర దాదాపు రూ. 300కి చేరుకోవచ్చు" అని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి హోల్‌సేల్ వ్యాపారి సంజయ్ భగత్ చెప్పారు. 

హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఎగుమతి చేసే టమాటా, ఇతర కూరగాయల నాణ్యత తగ్గిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో జులైలో భారీ వర్షాలు, పంటలకు నష్టం వాటిల్లింది.  జులై 14 నుండి రాయితీ ధరపై టమాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో, దేశ రాజధానిలో ఇటీవల రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయి, అయితే కొరత కారణంగా మళ్లీ అవే ధరలు కంటిన్యూ అవుతున్నాయి. 

ఆజాద్‌పూర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అనిల్ మల్హోత్రా మాట్లాడుతూ.. మార్కెట్‌లో టమాటాకు సప్లయ్, డిమాండ్ రెండూ తక్కువగా ఉన్నాయని, అమ్మేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు."కూరగాయలు ఆలస్యంగా ఎగుమతి చేయడం, నాణ్యత క్షీణించడం వంటి ఇబ్బందులను వారు ఎదుర్కొంటున్నారు.  

టమోటాలు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు" అని మల్హోత్రా చెప్పారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా ప్రకారం, టమాటా రిటైల్ ధర  ఆగస్టు 2న కిలో రూ. 203కి చేరుకోగా, మదర్ డెయిరీకి చెందిన సఫాల్ రిటైల్ అవుట్‌లెట్లలో కిలో ధర రూ.259గా ఉంది. 

ఇలా టమాటా ధరలు పెరుగుతూ పోతే అది భవిష్యత్తులో అందని ద్రాక్షగానే మారుతుందని.. ప్రభుత్వాలు ఇకనైనా వాటి ధరలు నియంత్రించేలా చర్యలు తీసుకోని.. రాయితీపై టమాటాలు అందించాలని సామాన్యులు కోరుతున్నారు.