ప్రతి నెలా వెయ్యెకరాల్లో టమాట వెయ్యాలె

ప్రతి నెలా వెయ్యెకరాల్లో టమాట వెయ్యాలె

ఫిబ్రవరి నుంచి 3 నెలలు పాటించాలి

ఏటా మే నుంచి ఆగస్టు వరకూ ధరలు పెరుగుతున్నయ్ 

ఫిబ్రవరి నుంచి పండిస్తే టమాట కొరత ఉండదు   

ప్రభుత్వానికి హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ నివేదిక

హైదరాబాద్, వెలుగు: కొన్నిసార్లు కిలో 2 రూపాయలకు అమ్ముతామన్నా కొనేటోళ్లుండరు.. మరికొన్ని సార్లు కిలో100 రూపాయలకు కొనేటోళ్లున్నా స్టాకు ఉండదు. టమాటాల విషయంలో ఏటా ఇవే సీన్లు కన్పిస్తుంటయి. వానాకాలంలో మార్కెట్ కు పంట భారీగా వస్తుండటం.. ఎండకాలంలో బాగా తగ్గిపోతుండటంతో ఇలా ధరల్లో చాలా తేడాలు వస్తున్నాయి. అందుకే.. టమాట పంటను బ్యాలెన్స్ చేస్తే.. అటు జనానికి, ఇటు రైతులకు మేలు చేయొచ్చని హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ భావిస్తోంది. ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు ప్రతినెలా వెయ్యి ఎకరాల్లో టమాట పంట పండించేలా చూస్తే.. ఎండాకాలం టమాటల కొరత తీరుతుందని చెప్తోంది. టమాట పంట విషయంలో ఏడాదంతా అమలు చేయాల్సిన అంశాలను వివరిస్తూ ఈ మేరకు సర్కార్ కు నివేదిక అందజేసింది.

ఆ మూడు నెలల్లో 3 వేల ఎకరాల్లో..

రాష్ట్రంలో ఏటా సాధారణంగా 90 వేలకు పైగా ఎకరాల్లో 9.50 లక్షల టన్నుల టమాట ఉత్పత్తి అవుతోంది. అయితే రాష్ట్ర అవసరాలకు 5.37 లక్షల టన్నుల టమాటాలు సరిపోతాయి. కానీ ఏడాదంతా ప్రతినెలా టమాటాలు అందుబాటులో ఉండటం లేదు. ఏటా సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ దాకా పంట ఎక్కువగా ఉండటంతో ధరలు లేక రైతులు నష్టపోతుంటే.. మే, ఆ తర్వాతి నెలల్లో టమాటాలకు కొరత ఏర్పడటంతో జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. మే నెలలో అధిక ఎండలకు ఈ పంట ఎక్కువగా దెబ్బతిని దిగుబడి పడిపోతోంది. అందుకే ఫిబ్రవరి, మార్చి, ఎప్రిల్ నెలల్లో వెయ్యి చొప్పున ఎకరాల్లో టమాట సాగును ప్రోత్సహించాలి. దీనివల్ల ఎండాకాలంలోనూ మార్కెట్లో పంట అందుబాటులోకి వచ్చి ధరలు బ్యాలెన్స్ గా ఉండే అవకాశం ఉంటుందని ఉద్యాన శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

41 వేల ఎకరాల్లో కూరగాయల సాగు..

రాష్ట్ర అవసరాలకు ఏటా7.22 లక్షల టన్నుల కూరగాయలు అవసరమని హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. ఇందుకోసం 41,840 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు కావాలని నివేదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పండిస్తున్న కూరగాయలు సరిపోకపోవడంతో ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. అందుకే రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రత్యేకంగా రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్, యాదాద్రి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పంట కాలనీలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆకు కూరలను కూడా10,300 ఎకరాల్లో సాగు చేయాలని పేర్కొంది. బెండ 6 వేల ఎకరాల్లో, కాకరకాయ1900 ఎకరాల్లో ఉండాలని చెప్పింది. పచ్చి మిరప 4600 ఎకరాల్లో, ఆలుగడ్డ 3800 ఎకరాల్లో, క్యాబేజీ 550 ఎకరాలు, చిక్కుడు 5200 ఎకరాల్లో సాగు చేయాలని వివరించింది.

నివేదికలోని ప్రతిపాదనలు ఇవే..

ఫిబ్రవరి నుంచి ప్రతి నెలా వెయ్యి ఎకరాల్లో.. మూడు నెలలు కలిపి 3 వేల ఎకరాల్లో టమాట సాగును ప్రోత్సహించాలి.

జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్​ఎక్సలెన్స్ నుంచి ఎకరాకు సరిపోయే నారును రూ.7,200 సబ్సిడీతో రైతులకివ్వాలి.

పంట కాలనీల ఏర్పాటుకు ఒక్కో పంటకు 50 నుంచి 100 ఎకరాలను ఒక క్లస్టర్‌‌గా విభజించాలి.

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో టమాట, వంగ, బెండ వంటి తోటల సాగును పెంచేందుకు ఎకరాకు రూ. 15,320 సబ్సిడీ ఇవ్వాలి.

రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర వచ్చేలా మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు కావాలి.

వేసవిలో మే నుంచి ఆగస్టు వరకూ కూరగాయల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నివారించేందుకు మార్చి నుంచే సాగు పెంచాలి.

ప్రతి మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా చుట్టుపక్కల గ్రామాల్లో పంటల సాగు విస్తీర్ణం పెరగాలి. అక్కడి నేలలు, వాతావరణం ఆధారంగా పంటల కాలనీలు ఏర్పాటు చేయాలి.

For More News..

సంక్రాంతి తర్వాత స్కూళ్లు, కాలేజీలు ఓపెన్!

ఏపీ సర్కారును సరిగా రాయడం నేర్చుకోవాలన్న కేంద్రం

పరిహారం తేల్చకుండా పనులు కానివ్వం