
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. గురు, శుక్రవారాల్లో జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ఈ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన అర్బన్ పాలసీలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, హైదరాబాద్ నగర కార్పొరేషన్‌కు చట్టాలను తీసుకువస్తున్నారు. హెచ్‌ఎండీఏతో పాటు ఇతర నగరాల అభివృద్ధి మండళ్లకు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి తేనున్నారు. సంబంధిత చట్టాల డ్రాఫ్ట్‌కు న్యాయ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
ఇంకేం అంశాలుంటాయి?
జూన్ 18న కేబినెట్ భేటీలో అసెంబ్లీ, సెక్రటేరియట్ కొత్త భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి, డైరెక్టర్ ఎన్.శంకర్‌కు, శారదా పీఠానికి భూములు కేటాయించారు. అయితే పీఆర్సీ, ఉద్యోగుల రిటైర్మెంట్ పెంపుపై తర్వాత జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో మంగళవారం భేటీలో ఏ అంశాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ, సెక్రటేరియెట్, వాటిపై కోర్టు కేసులు, టెక్నికల్, మినిస్టర్స్ కమిటీల నియామకం, ఆ కమిటీల ప్రాథమిక నివేదికలపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. కేవలం మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలపడంతోనే సరిపెట్ట వచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.