- ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.92,500 కోట్ల విలువైన ఆస్తులు అమ్మిన 28 కంపెనీలు
- టాప్‌లో ప్రెస్టీజ్ ఎస్టేట్, డీఎల్‌ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్
న్యూఢిల్లీ: భారతదేశంలోని 28 ప్రధాన లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో దాదాపు రూ.92,500 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అత్యధిక ప్రీ-సేల్స్‌తో ముందంజలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2024-–25) మొత్తంలో 26 ప్రధాన లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థలు రూ.1.62 లక్షల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాయి. ఆ సమయంలో గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.30 వేల కోట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. తాజా రెగ్యులేటరీ ఫైలింగ్స్ ఆధారంగా సేకరించిన డేటా ప్రకారం, ఈ 28 కంపెనీలు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.92,437 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ.18,143.7 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ రూ.15,757 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ముంబైకి చెందిన గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.15,587 కోట్ల సేల్స్ బుకింగ్స్ సాధించింది. లోధా డెవలపర్స్ రూ.9,020 కోట్ల ఆస్తులను విక్రయించగా, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లోని సిగ్నేచర్ గ్లోబల్ రూ.4,650 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. ఈ ఐదు సంస్థలు కలిపి రూ.63,000 కోట్లకు పైగా విక్రయాలు చేసి మొత్తం ప్రీ-సేల్స్‌లో 70 శాతం వాటా సాధించాయి.
కరోనా తర్వాత జూమ్..
కరోనా తర్వాత రెసిడెన్షియల్ ఆస్తులకు భారిగా డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్‌లో లిస్ట్ అయిన రియల్ ఎస్టేట్ కంపెనీల పనితీరు మెరుగుపడింది. వినియోగదారులు ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. విశ్వసనీయమైన పెద్ద బ్రాండ్లను మాత్రమే ఎంచుకుంటున్నారు.
ఇతర కంపెనీల అమ్మకాలు..
ఇతర సంస్థల్లో బెంగళూరుకు చెందిన శోభ లిమిటెడ్ రూ.3,981.4 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ రూ.3,152 కోట్లు, ముంబైకి చెందిన ఓబ్రాయ్ రియాల్టీ రూ.2,937.74 కోట్లు, కల్పతరు లిమిటెడ్ రూ.2,577 కోట్లు, పురవంకర లిమిటెడ్ రూ.2,455 కోట్లు, కీస్టోన్ రియాల్టర్స్ (రుస్తమ్‌జీ బ్రాండ్) రూ.1,839 కోట్లు, సన్‌టెక్ రియాల్టీ రూ.1,359 కోట్లు, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ రూ.1,312 కోట్లు, కొల్టే-పాటిల్ డెవలపర్స్ రూ.1,286 కోట్లు, మహీంద్రా లైఫ్‌స్పేస్ రూ.1,200 కోట్లు, శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ.1,126 కోట్ల విక్రయాలు సాధించాయి. రూ.1,000 కోట్లలోపు ప్రీ-సేల్స్ విభాగంలో అజ్మేరా రియాల్టీ రూ.828 కోట్లు, రేమండ్ రియాల్టీ రూ.760 కోట్లు, అశియానా హౌసింగ్ రూ.734.4 కోట్లు, ఎంబసీ డెవలప్‌మెంట్స్, అర్వింద్ స్మార్ట్ స్పేసెస్ తలో రూ.607 కోట్లు, టార్క్ లిమిటెడ్ రూ.565 కోట్లు, మాక్స్ ఎస్టేట్స్ రూ.373 కోట్ల సేల్స్ సాధించాయి.
