
- టాప్-3 స్థానాల్లో అంబానీ, బిర్లా, జిందాల్
- వెల్లడించిన బార్క్లేస్, హురున్ రిపోర్ట్
న్యూఢిల్లీ: భారతదేశంలోని అత్యంత ధనిక వ్యాపార కుటుంబాల సంపద విపరీతంగా పెరుగుతోంది. టాప్–300 వ్యాపార కుటుంబాల ఒక రోజు సగటు సంపాదన రూ.7,100 కోట్ల వరకు ఉందని వెల్లడయింది. 2025 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యబుల్ఫ్యామిలీ బిజినెసెస్ లిస్ట్ ప్రకారం.. రూ. 28.2 లక్షల కోట్ల సంపాదనతో అంబానీ కుటుంబం వరుసగా రెండో ఏడాది కూడా దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబ వ్యాపార సంస్థగా నిలిచింది.
ఈ మొత్తం భారతదేశ జీడీపీలో దాదాపు పన్నెండో వంతుకు సమానం. ఈ అన్యువల్లిస్ట్ రెండో ఎడిషన్లో మరింత మంది సంపన్నులు చేరారు. కొత్తగా 100 మంది చేరడంతో మొత్తం కుటుంబాల సంఖ్య 300కి పెరిగింది. ఈ కుటుంబాల మొత్తం సంపద విలువ 1.6 ట్రిలియన్ డాలర్లు (రూ. 134 లక్షల కోట్లు) ఉంటుంది. ఈ మొత్తం తుర్కియే, ఫిన్లాండ్ దేశాల ఉమ్మడి జీడీపీని మించిపోయింది.
అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి మొదటిస్థానంలో నిలవగా, కుమార మంగళం బిర్లా కుటుంబం రెండో స్థానంలో ఉంది. ఈ కుటుంబ వ్యాపారాల విలువ ఏడాదిలో రూ. 1.1 లక్షల కోట్లు పెరిగి రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. జిందాల్ కుటుంబం సంపద విలువ రూ. లక్ష కోట్ల పెరుగుదలతో రూ. 5.7 లక్షల కోట్లకు చేరి మూడో స్థానానికి ఎగబాకింది.
బజాజ్, మహీంద్రా, నాడార్, మురుగప్ప, ప్రేమ్జీ, అనిల్అగర్వాల్, డానీ, చోక్సీ, వకీల్ కుటుంబాలు మిగతా స్థానాల్లో ఉన్నాయి. అత్యంత విలువైన టాప్ 10 కుటుంబాల విలువే మొత్తం 300 కుటుంబాల సంపదలో సగం ఉంది. వీటి ఉమ్మడి విలువ రూ. 40.4 లక్షల కోట్లు కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే రూ. 4.6 లక్షల కోట్లు ఎక్కువ. ఈ మొత్తం ఫిలిప్పీన్స్ జీడీపీకి దాదాపు సమానం.